కరోనా ఎఫెక్ట్‌: వాయిదా పడుతున్న సినిమాలు

16 Mar, 2020 16:41 IST|Sakshi

కరోనా వైరస్‌ ప్రభావం సినిమా రంగంపై బలంగానే పడుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో సినిమా థియేట‌ర్స్‌ను ప‌లు ప్ర‌భుత్వాలు మూసివేయగా.. ఈ నెలలోనే కాదు వచ్చే నెలలో విడుదల కావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారీ ప్రభావంతో నాని ‘వి’ చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అరణ్య’ సినిమా విడుదలను వాయిదా వేశారు. కరోనా వైరస్‌ కారణంగా విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సోమవారం ట్విటర్‌లో వెల్లడించారు. ప్రభు సోలోమాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 2 విడుదల చేయాలని భావించారు. కానీ దేశంలో క్రమంగా కరోనా ప్రభావం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘త్వరలో థియేటర్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి’. అంటూ నిర్మాతలు ట్వీట్‌ చేశారు. (నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌)

కాగా ఇప్పటికే కరోనా కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, పాఠశాలలు మూతపడ్డ విషయం తెలిసిందే. కొన్ని సినిమాలు షూటింగ్‌లు సైతం వాయిదా పడుతున్నాయి. కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్‌ తమ సినిమాల షూటింగ్‌ను వాయిదా వేస్తున్నాట్లు ప్రకటించారు. అలాగే అనుష్య నటించిన ‘నిశ్శబ్ధం’ కూడా వాయిదా పడే అవకాశం ఉంది. మరోవైపు కరోనాను క్యాష్‌ చేసుకునేందుకు టైటిల్లో కరోనా వచ్చేలా సినిమా పేరును ఖరారు చేసుకుంటున్నారు. (కరోనాపై రాజ‌మౌళి ట్వీట్‌)

అదే విధంగా బాలీవుడ్‌ స్టార్‌ షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ సినిమా షూటింగ్‌ను కొన్ని రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు శనివారం ట్వీట్‌ చేశారు. అలాగే అక్షయ్‌ కుమార్‌ సూర్యవంశీ సినిమాను కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాత కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. ఈ సినిమాను మొదట ఈ నెల 24 న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో విడుదలను వాయిదా వేశారు. అలాగే హాలీవుడ్‌ సినిమాలు ఎక్వైట్‌ ప్లేస్‌, ములన్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ 9తో పాటు జేమ్స్‌ బాండ్‌ చిత్రం ‘నోటైమ్‌ టు డై’ కూడా విడుదల వాయిదా పడింది. (కరోనా దెబ్బ: సినిమా షూటింగ్‌లు బంద్‌)

మరిన్ని వార్తలు