కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

28 Mar, 2020 16:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌19) అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. వ్యాపార, సినిమా, క్రీడా రంగాలపై దీని ప్రభావం భారీగా ఉంది. ముఖ్యంగా సినిమా రిలీజ్‌లు వాయిదా పడటం.. షూటింగ్‌లు రద్దవ్వడంతో సినీ కార్మికులకు ఉపాధి కరువయింది. రెక్కాడితేగాని డొక్కాడని ఆ  పేద సినీ కార్మికుల దైనందన జీవితం కష్టంగా మారింది. అయితే పేద సినీ కార్మికుల కోసం టాలీవుడ్‌ ప్రముఖులు తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి పేద సినీ కార్మికుల కోసం రూ. కోటి విరాళం ఇ‍వ్వగా.. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు ప్రకటించి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. 

తాజాగా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున సైతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో(టీఎఫ్‌ఐ)ని రోజువారి కూలీలకు, అలాగే తక్కువ సంపాదన ఉన్న వాళ్లకు తన వంతు సాయంగా రూ. కోటి విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని టీఎఫ్‌ఐకి అందించారు. ‘ప్రస్తుతం లాక్‌డౌన్‌ అనేది అవసరం. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే లాక్‌డౌన్‌ అవసరం. లాక్‌డౌన్‌ పాటిస్తున్న వారికి.. మద్దతుగా నిలుస్తున్న వారికి నా అభినందనలు. ఈ కష్టకాలంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. ఈ సమయంలో పేద సినీ కార్మికుల కోసం నా వంతుగా రూ. కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తునన్నా. దేవుడు మనలను చల్లగా చూస్తాడు.. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి’అంటూ నాగార్జున పేర్కొంటూ తన గొప్ప మనసును చాటుకున్నారు. 

ఇక చిత్ర పరిశ్రమలోని పేద కార్మికులకు సహాయం చేస్తూనే ప్రభుత్వానికి కూడా తమ వంతు ఆర్థిక సహాయాన్ని టాలీవుడ్‌ ప్రముఖులు ప్రకటించారు. ఇప్పటికే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌, అనిల్‌ రావిపూడి, దిల్‌ రాజు, రాధాకృష్ణ, తదితరులు రెండు తెలుగు రాష్ట్రాలు సీఎం రిలీఫ్‌ పండ్‌కు విరాళాలు ప్రకటించారు. అయితే మరికొంత మంది ప్రధాన మంత్రి సహాయక నిధికి కూడా విరాళాలు ప్రకటించారు. 

చదవండి:
‘మాకు రాదులే’ అనుకోవడం ప్రమాదకరం
‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

మరిన్ని వార్తలు