‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

29 Mar, 2020 21:30 IST|Sakshi

‘నాకు కావాల్సిన బ్రాండెడ్‌ గోధుమ పిండి కోసం శ్రీనగర్‌ కాలనీలో దొరకడం లేదని ఖైరతాబాద్‌కు వచ్చా’ , ‘పిల్లలు పాలకూర కావాలన్నారు అందుకే దూరమైన ఈ మార్కెట్‌కు వచ్చాను’, ‘ఇంట్లో ఉండలేకపోతున్నా అందుకే బయట పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చాను’,  ‘పొద్దస్తమానం ఇంట్లో ఉండలేక ఆలా దోస్త్‌లను కలుద్దామని వచ్చా’, ‘లాక్‌డైన్‌ చాలా కష్టంగా ఉంది మాష్టారు’. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొందరి వ్యాఖ్యలు ఇవి. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ నిర్భంధం, సామాజిక దూరంతో కరోనా బారిన పడకుండా ఉండొచ్చని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా కొంతమంది ప్రబుద్దులు పెడచెవిన పెడుతున్నారు. ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. కొన్ని చోట్ల పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పినా వారిలో మార్పు రావడం లేదు. ఈ క్రమంలో టాలీవుడ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఓ వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ఆ వీడియోలో.. ‘లాక్‌డౌన్‌కు మించిన ఘటనలను అనేక దేశాల ప్రజలు కొన్నేళ్ల పాటు అనుభవించారు. సిరియా యుద్దం గురించి మీరందరూ తెలుసుకోవాలి. దాదాపు ఎనిమిదేళ్లపాటు ఆ దేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారు. సియాచిన్‌లో మన సైనికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసా? నైజీరియాలో ఓ తీవ్రవాద సంస్థ 300 మంది విద్యార్థినులను కిడ్నాప్‌ చేసి దాదాపు ఐదేళ్ల పాటు నిర్భంధంలో ఉంచింది. వలసదారులు, అనాథలు లాక్‌డౌన్‌ మించిన పరిస్థితులను కొన్నేళ్ల పాటు అనుభవించారు.

ప్రపంచవ్యాప్తంగా వీరందరూ అనుభవించిన దానికంటే కష్టమా మనం పాటించే లాక్‌డౌన్‌? లాక్‌డౌన్‌ పీరియడ్‌ ఏదో దారుణం అని ఫీల్‌ అవ్వద్దు. ప్రపంచంలోని మిగతా కష్టాలు కూడా గుర్తుతెచ్చుకుంటే మనం చాలా బాగున్నాం. అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనందరం వార్‌ జోన్‌లో ఉన్నాం’ అంటూ పూరి​ జగన్నాథ్‌ పేర్కొన్నాడు.  అదేవిధంగా లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం కూడా ఉందని దానికి కూడా ప్రజలు సిద్దంగా ఉండాలని సూచించాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా