లిక్కర్‌ షాపులు తెరవండి : నటుడి విజ్ఞప్తి

28 Mar, 2020 20:02 IST|Sakshi

సాక్షి, ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల  దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు చ‌ర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌ప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. జనాలంతా ఇళ్లకే పరిమితమైపోయారు. ఇక కరోనా మహమ్మారి మందుబాబుల గ్లాసుపై కూడా కొట్టింది. తాగడానికి మద్యం లేక మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. ఏ బ్రాండ్‌ అయినా పర్వాలేదు ఓ పెగ్గు దొరికితే చాలన్నట్లు ఎదురు చూస్తున్నారు. రోజుకి కనీసం రెండు గంటలు అయినా లిక్కర్‌ స్టోర్స్‌ తెరవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాంటి వారికి నేనున్నానంటూ మద్దతుగా నిలిచాడు బాలీవుడ్‌ సినియర్‌ నటుడు రిషి కపూర్‌. ప్రతి రోజు సాయంత్రం లిక్కర్‌ షాపులు తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. 

‘ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నుండి డ‌బ్బు అవ‌స‌రం. అందుకోసం కొంత కాలం లైసెన్స్ పొందిన మ‌ద్యం దుకాణాల‌ని సాయంత్రం స‌మ‌యంలో తెర‌వాలి. ఈ విష‌యంలో న‌న్ను తప్పుగా అర్థం చేసుకొని తిట్టొద్దు. మనిషి ఇంట్లో అనిశ్చితి, నిరాశతో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి’ అని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. 

కాగా రిషి కపూర్‌ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ ఉన్నతంగా ఆలోచించండి రిషీజీ. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కొంతమంది నిత్యవసర వస్తువులు లేకుండా బాధ పడుతున్నారు. టీవీల్లో వార్తలు చూసైనా దేశంలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను తెలుసుకోండి. ప్రభుత్వానికి మీరు ఇంత అపరిపక్వ సూచన ఇస్తారా? మీ లాంటి ధనవంతులు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు’ అని ఓ నెటిజన్‌ మండిపడగా..  మందుబాబుల కుటుంబాల గురించి ఆలోచించారా? మద్యం తాగి కుటుంబంలోని మహిళలపై దాడి చేస్తే ఎలా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిందిపోయి మద్యం గురించి మాట్లాడుతారా? అంటూ మరో నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు