'అంచనాలు లేకుండానే సంచలనంగా బరిలోకి'

23 Sep, 2015 19:57 IST|Sakshi
'అంచనాలు లేకుండానే సంచలనంగా బరిలోకి'

అంతా కొత్తవారితో ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన సినిమా 'కోర్టు'. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ 'కోర్టు' డ్రామా. దర్శకుడు చైతన్య తమానే తొలి ప్రయత్నంతోనే ఆస్కార్ నామినేషన్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిత్ర నిర్మాత వివేక్ గొంబేర్ ప్రధాన పాత్రలో నటించగా, మరాఠి స్టేజ్ ఆర్టిస్ట్ విరా సాథిదర్, ప్రదీప్ జోషిలు ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన కోర్టు.. 2014 వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో హారిజన్స్ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది. 116 నిమిషాల ఈ సినిమా భారత్ లో ఏప్రిల్ 17న విడుదలైంది. మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లిష్‌, గుజరాతీ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన రచనలు, పాటలతో ఓ మున్సిపల్ కార్మికుడిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడో ఓ వ్యక్తి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా అతడు భారత న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రశ్నలు సంధించాడు. అందుకు బదులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయమూర్తి ఎలా స్పందించారు అన్నదే సినిమా కథ. అతి తక్కువ పాత్రలతో మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండానే తాజాగా సంచలనం సృష్టించి భారత్ తరపున ఆస్కార్ ఎంపికలో నిలిచింది. పికె, బాహుబలి, హైదర్, మసాన్ లాంటి సినిమాలు  బరిలో ఉన్నా వాటన్నింటిని వెనక్కి నెట్టి ప్రాంతీయ భాషా చిత్రం 'కోర్టు' ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో నామినీగా ఎంపిక అయ్యింది.

పోటీలో ఉన్న సినిమాలన్ని నామినీగా ఎంపిక చేయటానికి అర్హత ఉన్న సినిమాలే అయిన ఒక్క సినిమా  మాత్రమే ఎంపిక చేయక తప్పని పరిస్థితుల్లో సృజనాత్మకత, సాంకేతిక విలువలు, నటీనటుల ప్రతిభ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు సినిమాను ఎంపిక చేసినట్టుగా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అమోల్ పాలేకర్ ప్రకటించారు. జ్యూరిలోని 15 సభ్యులు ఏకాభిప్రాయంతో కోర్టు సినిమాను నామినీగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు.