శిరస్సు వంచి నమస్కరించిన అమితాబ్‌

12 Jul, 2020 13:01 IST|Sakshi

ముంబై: కరోనా బారినపడి ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ వైద్య సిబ్బందిని దేవుడితో పోల్చారు. దేవుళ్లు తెల్లకోటు వేసుకుని డాక్టర్ల రూపంలో ప్రజలకు సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైద్యుల సేవలపట్ల ఆయన శిరస్సు వంచి నమస్కరించారు. ఆయన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. నానావతి ఆస్పత్రి సిబ్బంది ఈ కష్టకాలంలో చేస్తున్న అద్భుత సేవలను అభినందిస్తున్నా. కొద్ది రోజుల క్రితం సూరత్‌లో ఒక బిల్‌ బోర్డు చూశాను. గుడులు ఎందుకు మూతబడ్డాయో తెలుసా? భగవంతుడు ఆలయాలు వీడి తెల్లకోటు వేసుకుని ఆస్పత్రుల్లో సేవ చేస్తున్నారు. 

ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అందరిలోనూ దేవుడు ఉన్నాడు. మీ సేవలతో మానవత్వాన్ని కాపాడుతున్నారు. మీ సేవలకు శిరస్సువంచి నమస్కరిస్తున్నా. మీరే లేకపోతో మానవత్వం ఏమయ్యేదో. ఈ కరోనా కష్టకాలంలో ఎవరూ నిరాశ చెందొద్దు. ఆందోళన పడొద్దు. కలిసికట్టుగా పనిచేసి కరోనాకష్టాల నుంచి బయటపడదాం. నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. కరోనాపై పోరాడుతున్న వారందరూ భగవంతుని స్వరూపాలు’అని అమితాబ్‌ పేర్కొన్నారు. 
(చదవండి: నటుడి కుటుంబంలో నలుగురికి కరోనా)

ఇక నానావతి ఆస్పత్రిలోని రెస్పిరేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న అమితాబ్‌, అభిషేక్‌ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. వారిద్దరికీ స్వల్పస్థాయిలోనే వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. బిగ్‌ బీ, అభిషేక్‌ చికిత్స నేపథ్యంలో నానావతి ఆస్పత్రి వద్ద పోలీసు అధికారులు భద్రతను పెంచారు. ఇక తండ్రీ కొడుకులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అమితాబ్‌ నివాసం ‘జల్సా’ వద్ద బీఎంసీ అధికారులు శానిటైజేషన్‌ పనులను పర్యవేక్షించారు. జల్సాను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి మెయిన్‌ గేట్‌కు బ్యానర్‌ అంటించారు. 
(అమితాబ్‌కు మెగాస్టార్‌ చిరు ట్వీట్‌)

మరిన్ని వార్తలు