నాది నలభై ఏళ్ల ప్రస్థానం

1 May, 2014 23:13 IST|Sakshi
నాది నలభై ఏళ్ల ప్రస్థానం

 ‘‘ఒకప్పటి సినిమాల్లో కథ ఉండేది. ఇప్పటి సినిమాల్లో కథాకాకరకాయ్ ఏమీ ఉండదు. తలాతోకా లేని సినిమాలు చాలా వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సినిమా పరిశ్రమ పరిస్థితి అయితే మాత్రం అంత బాగా లేదు’’ అని కె.ఎస్.రామారావు ఆవేదన వెలిబుచ్చారు. రేడియోలో వాణిజ్య ప్రకటనలతో మొదలై తరువాతి కాలంలో చిత్ర నిర్మాణానికి విస్తరించిన ‘క్రియేటివ్ కమర్షియల్స్’ సంస్థకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘‘1974లో రేడియో పబ్లిసిటీ రంగంలో క్రియేటివ్ కమర్షియల్స్ ప్రస్థానం మొదలైంది.
 
  ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని అప్పట్లో విభిన్నంగా ప్రమోట్ చేశాం. ఆ ఏడాది విడుదలైన చిత్రాల్లో లెజెండ్రీ హిట్ అంటే అదే. 1981లో ‘మౌనగీతం’ చిత్రంతో నిర్మాతగా మారాను. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవిలో కసి, పట్టుదల చూసి ఆయన్ను హీరోగా పెట్టి ‘అభిలాష’ తీశాను. అప్పట్నుంచి ఇప్పటివరకూ అశ్లీలం, ద్వంద్వార్థ సంభాషణలకు ఆస్కారం లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వచ్చాం. ఇక నుంచి కూడా మా నుంచి అలాంటి సినిమాలే వస్తాయి’’ అని నమ్మకంగా చెప్పారు కేఎస్. ‘‘చిరంజీవికి ‘మరణమృదంగం’ సమయంలో ‘సూపర్‌స్టార్’ బిరుదు ఇద్దామనుకున్నాం. అయితే... అప్పటికే ఆ బిరుదుతో కృష్ణగారు పాపులర్. అందుకే ‘మెగాస్టార్’ బిరుదు ఇచ్చాం. నిజంగా అది చాలా అరుదైన బిరుదు’’ అని గత స్మృతుల్ని నెమరేసుకున్నారు కేఎస్ రామారావు.