క్రైమ్ సీన్‌ ఫొటోలు బయటకు వచ్చాయి

20 Feb, 2017 11:38 IST|Sakshi
క్రైమ్ సీన్‌ ఫొటోలు బయటకు వచ్చాయి

పారిస్: రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్‌ నగల చోరీ కేసుకు సంబంధించిన ఫోటోలను ఫ్రెంచ్‌ మీడియా బయటపెట్టింది. గతేడాది అక్టోబర్‌ లో పారిస్ హోటల్ లో కర్దాషియన్‌ ను తుపాకీతో బెదిరించి ఆమె నగలను దుండగులు ఎత్తుకుపోయారు. 4 మిలియన్‌ డాలర్లు విలువ చేసే ఉంగరంతో సహా ఖరీదైన ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, సీసీ టీవీ ఫుటేజీని ఫ్రెంచ్‌ మీడియా నెట్‌ వర్క్ టీఎఫ్‌ఐ వెలుగులోకి తెచ్చింది.

హోటల్ లో కర్దాషియన్‌ బసచేసిన గదిలోపలి ఫొటోలు ఇందులో ఉన్నాయి. కర్దాషియన్‌ ను బంధించేందుకు దుండగులు ఉపయోగించిన డక్ట్ టేపు, ప్లాస్టిక్‌ తాడు తదితర వస్తువులను కూడా ఫొటోలు తీశారు. దుండగులు హోటల్‌ లోపలికి ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించాయి. ఈ కేసులో 10 మంది నిందితులను జనవరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు.