రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్‌

7 Jun, 2020 03:42 IST|Sakshi
సి. కల్యాణ్, అభిరామ్‌ దగ్గుబాటి

– సి. కల్యాణ్‌

‘‘రామానాయుడుగారంటే మాకు ఓ హీరో, రోల్‌మోడల్‌. దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తులు. సినీ పరిశ్రమ, దాని అనుబంధ కార్యాలయాలన్నీ అభివృద్ధి కావడానికి రామానాయుడుగారే కారణం. ఆయన జయంతిని మేం గొప్పగా జరుపుకుంటాం. ఆయన్ను తలచుకునే సినిమా స్టార్ట్‌ చేస్తాం. రామానాయుడుగారి వారసుడిగా అభిరామ్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్‌. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ –‘‘రామానాయుడుగారు లేకుంటే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఫిలిం నగర్, హౌసింగ్‌ సొసైటీ ఉండేది కాదు.

రామానాయుడుగారి పేరుతో ఏది  మొదలుపెట్టినా అది సక్సెస్‌. చెన్నారెడ్డి, దాసరి నారాయణరావు, రామానాయుడుగార్లు ఫిలింనగర్‌కు దేవుళ్లులాంటి వారు’’ అని అన్నారు. ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. వారి ఫాలోయర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్‌లో మంచి సినిమాలు రావడానికి నాయుడుగారి ప్రోత్సాహం ఉంది’’ అన్నారు నిర్మాత కేఎస్‌ రామారావు. ‘‘మా తాతగారు భౌతికంగా లేకున్నా మానసికంగా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు’’ అన్నారు అభిరామ్‌. ఈ కార్యక్రమంలో రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్, కేఎస్‌ రామారావు, అభిరామ్‌ దగ్గుబాటి, కాజా సూర్య నారాయణ, జె. బాలరాజు రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు