దాదా.. షెహెన్‌షా

25 Sep, 2019 02:20 IST|Sakshi

షోలేలో వీరూకి అతడు ‘జయ్‌’.
‘దీవార్‌’లో శశికపూర్‌కి ‘భాయ్‌’.
కొందరికి ప్రేమగా ‘లంబూజీ’.
మరికొందరికి చనువుగా ‘బడే మియా’.
ఇండస్ట్రీకి ఏమో ‘బిగ్‌ బీ’.
బాలీవుడ్‌కు ఏ కొత్త హీరో వచ్చినా ఆయన డైలాగ్‌ ఒక్కటే ‘రిష్తే మే హమ్‌ తుమ్హారే  బాప్‌ హోతే హై. నామ్‌ హై షెహెన్‌ షా’.. ‘వరుసకు నీ అబ్బనవుతాను. పేరు షెహెన్‌షా’. 
దశాబ్దాలుగా తెర మీద ఆ రూపం తనివి తీరనివ్వలేదు. ఆ పుర్రచేతి వాటం మురిసిపోనీకుండా ఆపలేదు. అమితాబ్‌.. అమితాబ్‌.. సూపర్‌స్టార్‌ అమితాబ్‌. కమర్షియల్‌ కందకాలను దాటుకుని తనలోని నటుడికి దారి ఇచ్చి ‘స్టార్‌’ నుంచి ‘యాక్టర్‌’ అయి గౌరవం అందుకుంటున్నాడు. అవార్డులు కొంతమందికి శోభను తెస్తాయి. ఫాల్కేకు అమితాబే అతిపెద్ద శోభ.

‘కొంతమంది అందంగా ఉండటం వల్ల సిని మాలలో రాణిస్తారు. కొంతమంది డిఫరెంట్‌గా చేయ డం వల్ల అందలం ఎక్కుతారు. అమితాబ్‌ అందంగా ఉంటాడు. డిఫరెంట్‌గా కూడా చేస్తాడు. అందుకే అతడు సూపర్‌స్టార్‌ అయ్యాడు’ అని శతృఘ్నసిన్హా ఒకసారి అన్నాడు. అమితాబ్‌ తన రూపంతో మాత్రమే కాదు టాలెంట్‌తో కూడా ఉపఖండం ప్రజ లనే కాదు ప్రపంచం యావత్తు ఉన్న సినిమా అభిమా నులకు ఆరాధ్య దైవం అయ్యాడు.

‘పండిత పుత్రుడు దేనికీ కొరగాడు’ అని పెద్దలు అంటారు గాని అమితాబ్‌ ఆ వాడుకను తప్పుగా నిరూపించాడు. తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌ గొప్ప కవి. ప్రొఫెసర్‌. ఆయనకు పెద్ద కుమారుడిగా జన్మించిన అమితాబ్‌ కాలేజీ రోజుల నుంచే నటుడిగా తన ఆసక్తిని నిర్మించు కున్నాడు. అయితే ఆ కెరీర్‌లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక కలకత్తాలో సేల్స్‌ ఉద్యోగం చేసుకునేవాడు. అతని తమ్ముడు అజిత్‌ అతని ఫొటోలు సినిమా ఆఫీసులకు పంపుతూ అమితాబ్‌ నటుడు అవడానికి ప్రేరేపణ ఇచ్చాడు.

ఇందిరాగాంధీ రికమండేషన్‌ లెటర్‌
నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, అమితాబ్‌ తల్లి తేజీ బచ్చన్‌ స్నేహితులు. తేజీ చాలా తరచు ఇందిరా గాంధీ ఇంటికి వెళుతుండేవారు. ‘మా పెద్దాడికి సినిమా ఆసక్తి’ అని చెప్తే ఆమె తనకు పరిచయం ఉన్న జర్నలిస్ట్, రచయిత, సినిమా దర్శకుడు కె.ఎ.అబ్బాస్‌కు సిఫార్సు ఉత్తరం రాసి అమితాబ్‌ను బొంబాయి (ముంబై) పంపించారు. అలా అమి తాబ్‌కు ‘సాత్‌ హిందుస్తానీ’లో మొదటిసారి అవ కాశం వచ్చింది. ఆ తర్వాత ముంబైలో గది తీసుకుని అవస్థలుపడుతున్న అమితాబ్‌ను కమెడియన్‌ మెహమూద్‌ దగ్గరకు తీశాడు. ‘బాంబే టు గోవా’లో హీరోగా అవకాశం ఇచ్చాడు. అందులో ‘దేఖా నా హాయ్‌రే’ పాటకు స్టెప్పులేయలేక, స్టెప్పులు తెలియక అమితాబ్‌ ఏడుస్తూ ఉంటే మెహమూదే ధైర్యం చెప్పి పాట చేయించాడు. ఆ తర్వాత అమితాబ్‌ నాటి ‘భగవాన్‌ దాదా’ స్టయిల్‌లో చేతులెత్తి చేసే స్టెప్పులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.

జంజీర్‌..
అమితాబ్‌ కెరీర్‌ను అతని పట్ల ప్రేమ పెంచుకున్న జయా బచ్చన్‌ మలుపు తిప్పింది. సలీమ్‌ జావెద్‌ రాసిన ‘జంజీర్‌’ స్క్రిప్ట్‌ అమితాబ్‌కు వచ్చేలా చేయడంలో ఆమె కూడా పాత్ర వహించింది. రొమాంటిక్‌ హీరోల ఆనాటి ధోరణిని అమితాబ్‌ ‘జంజీర్‌’లో యాంగ్రీ యంగ్‌మెన్‌ ఇమేజ్‌తో చావబాదాడు. ఆ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయ్యింది. షేర్‌ ఖాన్‌ అయిన ప్రాణ్‌ను పోలీస్‌ స్టేషన్‌లో ‘షరాఫత్‌ సే ఖడే రహో... ఏ స్టేషన్‌ హై... కోయీ తుమ్హారా బాప్‌ కా జగా నహీ’ (మర్యాదగా నిలబడి ఉండు.. ఇది స్టేషన్‌... నీ బాబుగాడి చోటు కాదు) డైలాగ్‌తో అమితాబ్‌ స్టార్‌గా అవతరించాడు. ఆ తర్వాత షోలే, దీవార్‌ అతణ్ణి సూపర్‌స్టార్‌ని చేశాయి.

సూపర్‌హిట్లు
‘డాన్‌’, ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’, ‘నసీబ్‌’, ‘లావారీస్‌’, ‘మొకద్దర్‌ కా సికిందర్‌’... ఇలా అమితాబ్‌ కెరీర్‌లో వరుస సూపర్‌ హిట్లు వచ్చాయి. దర్శకులు ప్రకాష్‌ మెహ్రా, మన్‌ మోహన్‌ దేశాయ్‌ అతడి కెరీర్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు. యశ్‌ చోప్రా లాంటి రొమాంటిక్‌ దర్శకులు ‘కభీ కభీ’, ‘సిల్‌ సిలా’ వంటి హిట్స్‌ ఇచ్చారు. అమితాబ్‌ ఇంత కమర్షియల్‌ మూసలో కూడా తనను తాను కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రద్ధపెట్టాడు. యాక్షన్‌ సినిమాలలో కామెడీ చేయడం అతడికే చెల్లింది. ‘నమక్‌ హలాల్‌’, ‘చుప్‌కే చుప్‌కే’, ‘నట్వర్‌లాల్‌’ వంటి కామెడీ పాత్రలు అతణ్ణి ప్రేక్షకులకు చేరువ చేశాయి. రేఖాతో కలిసి అతడికి చుట్టూ వ్యాపించిన పుకార్లు మహిళా ప్రేక్షకులకు హాట్‌ టాపిక్స్‌ అయ్యాయి.

పడి లేచిన తరంగం
కొత్త హీరోల రాక వల్ల, సొంత సంస్థ ఏబిసీఎల్‌ నష్టాల వల్ల అమితాబ్‌ దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకున్నాడు. ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేసే దిగువ శ్రేణికి జారిపోయాడు. ఆ సమయంలో తిరిగి యశ్‌చోప్రా అతడికి ‘మొహబ్బతే’లో మంచి వేషం వేసి నిలబెట్టాడు. ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’ షో అమితాబ్‌ను ఇంటింటికి చేర్చింది. కొత్త దర్శకులతో కలిసి పని చేయడానికి అమితాబ్‌ సిద్ధం కావడంతో కొత్త కొత్త కథలు అతడి వద్దకు వచ్చాయి. ‘చీనీ కమ్‌’, ‘పా’, ‘బాగ్‌బన్‌’, ‘సర్కార్‌’, ‘దేవ్‌’, ‘పింక్‌’, ‘బద్‌లా’, ‘పికూ’... ఇలా అమితాబ్‌ గొప్పగొప్ప పాత్రలతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు.

పాత్రను నమ్మని నటుడు, పాత్రను అమాయకంగా పోషించని నటుడు కృతకంగా మారిపోయి ప్రేక్షకులకు దూరం అవుతాడు. కాని అమితాబ్‌ తాను రివాల్వర్‌ను చేతిలో పట్టుకుంటే నిజమైన రివాల్వర్‌ను పట్టుకున్నట్టే నిలుస్తాడు. రౌడీ కడుపులో ముష్టిఘాతం కురిపించే సమయంలో నిజమైన గుద్దు గుద్దినట్టే కనిపిస్తాడు. కెమెరా ముందు రిలాక్స్‌ కావడం అమితాబ్‌ కలలు కూడా చేయని పని. అందుకే ఆయన ఈనాటికీ సూపర్‌స్టార్‌గా నిలిచి ఉన్నాడు. కొత్తతరం పాత తరాన్ని గేలి చేయడం సర్వసాధారణం. కాని ఎందరు సమర్థ కొత్త నటులు వచ్చినా అమితాబ్‌ స్టేజీ మీదకు రాగానే ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇస్తారు. ఇప్పుడు ఆయనకు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చింది. ఈ క్షణంలో ప్రపంచంలో ఉన్న ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులంతా ఆయనకు ‘స్టాండింగ్‌ ఒవేషన్‌’ ఇస్తున్నారు. అమితాబ్‌ మరో నూరేళ్లు నటిస్తూ ఉండాలని కోరుకుందాం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా