రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేవాళ్లు

21 Sep, 2019 00:44 IST|Sakshi
తమిళిసై సౌందరరాజన్, నమ్రత, చంద్రశేఖర్‌ పుసాల్కర్, అభిషేక్‌ మిశ్రా, వినయ్, మంచు లక్ష్మీ

– తమిళిసై సౌందరరాజన్‌

‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్షిణాదిలో కూడా ఇవ్వడం సౌత్‌కి దక్కిన ఓ గొప్ప గుర్తింపు, గౌరవం’’ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్‌ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని ‘దాదాసాహెబ్‌ ఫాల్కే సౌత్‌ అవార్డ్స్‌ 2019’ వేడుకను శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోని పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళిసై సౌందరరాజన్‌ మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమకి సౌత్‌ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్‌ చాలా ఉంది.

ఒకప్పుడు మేం తమిళనాడులోని సాలెగ్రామంలో ఉండేవాళ్లం. అక్కడ చాలామంది ఫిల్మ్‌స్టార్స్‌ ఇళ్లు ఉండేవి. వాళ్లలో విజయ్‌కాంత్, విజయ్‌ వంటి వారున్నారు. వారి మధ్య నేను ఒక్కదాన్నే నాన్‌ ఫిల్మ్‌స్టార్‌గా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంతమంది ఫిల్మ్‌స్టార్స్‌ ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ వేడుకలో పాల్గొన డం గర్వంగా ఉంది. ఫిల్మ్‌స్టార్స్‌ పని ఈజీ కాదు. మంచి సినిమాలు తీయడం కోసం నిద్ర లేకుండా కష్టపడతారు. 30 ఏళ్ల కిందట తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పోలియో ఉండేది. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అప్పటి ప్రభుత్వం రజనీకాంత్, మనోరమ పోలియో డ్రాప్స్‌ అని ప్రచారం చేసేది. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి రజనీకాంత్‌ పోలియో డ్రాప్స్‌ వేయండి, మనోరమ పోలియో చుక్కల మందు వేయండి అనడం గర్వకారణం’’ అన్నారు.

అవార్డుగ్రహీతల స్పందన ఈ విధంగా...
► ‘భరత్‌ అనే నేను’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు మా వారికి (మహేశ్‌బాబు) రావడం గర్వంగా ఉంది. అనుకోని కారణాల వల్ల ఆయన ఈ వేడుకకు రాలేకపోయారు.
– నమ్రత, నటి–మహేశ్‌బాబు సతీమణి

► ‘రంగస్థలం’కి ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ఈ అవార్డును మా ఆవిడకి అంకితం ఇస్తున్నా. ఈరోజు తన పుట్టినరోజు.     
– సుకుమార్, డైరెక్టర్‌

► నేను సినిమా రంగంలో లేకున్నా ఫాల్కే మనవడిని అయినందుకు చాలా గర్విస్తున్నా. భారతీయ సినిమాను ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. హాలీవుడ్‌ సైతం ఇండియన్‌ మూవీస్‌ గురించి మాట్లాడుకుంటోంది. నాకు బాలీవుడ్‌ కన్నా దక్షిణాది చిత్రసీమ అంటేనే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా.  
– చంద్రశేఖర్‌ పుసాల్కర్‌

► ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాకి ఉత్తమ నూతన నటి అవార్డు రావడం హ్యాపీ. ఆస్కార్, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుల గురించి నా చిన్నప్పుడు మా అమ్మ గొప్పగా చెప్పేవారు.
– పాయల్‌ రాజ్‌పుత్, హీరోయిన్‌

► చిన్నప్పుడు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ గురించి విన్నప్పుడు ‘వావ్‌’ అనిపించేది. అలాంటిది ఇప్పుడు సౌత్‌లో ఈ అవార్డులను స్టార్ట్‌ చేయడం, నేను అవార్డు అందుకోవడం నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు మా నాన్న సత్యమూర్తిగారికి అంకితం.
– దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సంగీత దర్శకుడు (రంగస్థలం).  

► ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘రంగస్థలం’ సినిమాకి దాదాసాహెబ్‌గారి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మ, నా భార్య, కూతురికి అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వరుస షూటింగ్‌లతో వాళ్లను రెండేళ్లుగా మిస్‌ అవుతున్నా.
 – రత్నవేలు, కెమెరామేన్‌

► ఈ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ‘కేజీఎఫ్‌’ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు.       
– యష్, హీరో
‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ సీఈవో అభిషేక్‌ మిశ్రా, ప్రతినిధులు వినయ్‌తో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.


సురభి, పాయల్‌ రాజ్‌పుత్, అవికా గోర్, ఆషిమా

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు