నాన్నతో కలిసి పాడటం గొప్పగా అనిపించింది: సిద్దార్థ్

27 Jun, 2013 23:54 IST|Sakshi
సిద్దార్థ్ మహదేవన్

సిద్ధార్థ్ మహదేవన్... సినీపరిశ్రమలోకి కొత్తగా అడుగుపెట్టిన నూనుగు మీసాల  కుర్రాడు. పరిశ్రమలోకి కొత్తగా వచ్చారు కదా.. ఇబ్బందులేమైనా పడుతున్నారా? అని అడిగితే...‘అదేం లేదు. నేనిక్కడ చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నా. అంతా నాన్న చలవే. సంగీతం నాకేం కొత్తకాదు. చిన్నప్పటి నుంచి నా చుట్టూ సంగీతమే. నాన్న శంకర్ మహదేవన్ గాయకుడు కావడం వల్ల ఎంతోమంది సంగీత దర్శకులు మా ఇంటికి వస్తుండేవారు. దీంతో సంగీతం, సినీ పరిశ్రమతో నాకు చిన్నప్పటి నుంచే సాన్నిహిత్యముంది. పరిశ్రమలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఇక్కడ ఎదురవుతోంది. దీంతో ఇక్కడ నాకేం ఇబ్బంది లేదు. పైగా నాన్న అనుభవం నాకు ఎంతగానో కలిసొస్తోంది.
 
ప్రతిభ ఉన్న ప్రతిఒక్కరికీ పరిశ్రమలో మంచి గుర్తింపే లభిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం కూడా సాఫీగానే సాగిపోతుందని భావిస్తున్నాన’ని చెప్పాడు. మరాఠీ చిత్రంతో పరిశ్రమలోకి గాయకుడిగా అడుగుపెట్టిన సిద్ధార్థ్ ప్రముఖ దర్శకుడు దీపా మెహతా చిత్రం ‘మిడ్‌నైట్స్ చిల్డ్రన్’కు కూడా పనిచేశాడు. తాజాగా రాకేశ్ ఓం ప్రకాశ్  మెహ్రా చిత్రం ‘భాగ్ మిల్ఖా భాగ్’ చిత్రంలో తండ్రితో కలిసి పాడాడు. ఆ అనుభవాల గురించి చెప్పమంటే... ‘నిజంగా చాలా గొప్పగా అనిపించింది.
 
 నన్ను నేనే నమ్మలేకపోయా. చాలా పెద్ద సినిమాలో అవకాశం లభించింది. ఈ అనుభవంతో మరిన్ని చిత్రాలకు పనిచేసే అనుభవం లభించింది. సంగీతం నా ప్రాణం. అందుకే సంగీతం ద్వారానే ఎప్పటికైనా ఎదైనా చేయాలనుకుంటున్నాన’న్నాడు. ముంబైలోని ఆర్‌డీ నేషనల్ కాలేజీలో మాస్ మీడియా చదువుతున్న సిద్ధార్థ్‌కు కేవలం పాటలే కాకుండా ఆటలన్నా ఇష్టమే. క్రికెట్ ఆడడం, ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూడడం అంటే అతనికి ఎంతో ఇష్టం.