అలా ఫ్లోలో వెళ్లిపోయా

23 May, 2020 00:20 IST|Sakshi
రానా, లక్ష్మీ మంచు

– రానా

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఒకరైన రానా ఎవరూ ఊహించని విధంగా ‘మిహికాతో ప్రేమలో ఉన్నాను’ అని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఎవరీ మిహికా? రానా, మిహికా ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసుకోవాలని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రానాతో శుక్రవారం లక్ష్మీ మంచు జరిపిన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో సమాధానాలు దొరికాయి.

► లక్ష్మి: ఎవరీ మిహికా.. ఎప్పటినుండి ఈ లవ్, ఏంటి కథ?
రానా: వెంకటేశ్‌ బాబాయి పెద్దమ్మాయి ఆశ్రిత క్లాస్‌మేట్‌ మిహికా బజాజ్‌. నా ప్రేమ గురించి చెప్పాలంటే జస్ట్‌ లాక్‌డౌన్‌ ముందే జరిగింది. మిహికా నా ప్రేమికురాలిగా అందరికీ ఇప్పుడు తెలిసినా వాళ్ల ఫ్యామిలీ, ఆ అమ్మాయి చాలా ఏళ్లుగా మా కుటుంబానికి తెలుసు.

► లక్ష్మి: ఈ పెళ్లితో చాలామంది అమ్మాయిలనే కాకుండా అబ్బాయిలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లున్నావు?
రానా: అది ఎలా? అబ్బాయిలకు వచ్చిన బాధ ఏంటి?

► లక్ష్మి: ఇప్పటివరకు పెళ్లికాని అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే ‘అప్పుడే మాకు పెళ్లేంటి? మా ముందు రానా ఉన్నాడు’ అని నీ  పోస్టర్‌ పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు నువ్వు లేకుండా పోయావు. అది వాళ్ల బాధ.
రానా: ఒక వయసు దాటిన తర్వాత అలాంటి పోస్టర్లకు విలువ ఉండదు. ఒక సమయం తర్వాత పోస్టర్లు మారాలి (నవ్వులు).

► లక్ష్మి: కొందరు నీ పక్కన చాలామందిని ఊహించుకుంటే, సడెన్‌గా మిహికా వచ్చింది. నువ్వెలా డిసైడ్‌ చేసుకున్నావు ఈమె నా వైఫ్‌ అని?
రానా: మంచి పనులు జరుగుతున్నప్పుడు వాటిని అలా జరగనివ్వాలి. ఎక్కువగా ప్రశ్నలు, లెక్కలు వేయకూడదు. (నవ్వుతూ) అలా ఫ్లోలో వెళ్లిపోవాలంతే. నేను అలా ఫ్లోలో వెళ్లిపోయాను.  

► లక్ష్మి: మీ పేరెంట్స్‌ రియాక్షన్‌?
రానా: అమ్మా, నాన్న ఇద్దరూ షాక్డ్‌ టు జాయ్‌. ఫైనల్‌గా వాళ్లు చాలా హ్యాపీ.

► లక్ష్మి: ప్రేమ గురించి తనకు చెప్పేటప్పుడు నెర్వస్‌ ఫీలయ్యావా?
రానా: చాలా చిన్న వయసులో జరిగితే అలాంటి ఫీల్‌ ఉండేదేమో. పెరిగాను కదా.. అలాంటి ఫీలింగేమీ లేదు.

► లక్ష్మి: మిహికా తెలుగు మాట్లాడుతుందా?
రానా: మాట్లాడుతుంది కానీ మనంత క్లియర్‌గా కాదు. ఆమె ఇక్కడే పుట్టి పెరిగింది. హైదరాబాద్‌లో తనకు ‘డ్యూడ్రాప్‌’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఉంది. షీ ఈజ్‌ డూయింగ్‌ ఫైన్‌ అండ్‌ నైస్‌ థింగ్స్‌.

► లక్ష్మి: కావాలనే ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా?
రానా: అసలు అంత అలోచించలేదు. నేను ఆ అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం.

► లక్ష్మి: అవునట.. మీ అమ్మ లక్ష్మీగారు చెప్పారు. మొత్తం ఆరు నిమిషాల్లోనే అంతా ఫైనలైజ్‌ అయిందని. అది కూడా మూడు రోజులు రోజుకి రెండు... రెండు... రెండు నిమిషాలు మీ ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడుకున్నారట.
రానా: నిజంగా మేం మాట్లాడుకుంది ఆరు నిముషాలే.

► లక్ష్మి: ఇక పెళ్లి గురించి వెయిటింగా?
రానా:  ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. అందరిలానే నేను వెయిటింగ్‌. కానీ జస్ట్‌ లాక్‌డౌన్‌కి ముందు లవ్‌ కన్‌ఫర్మ్‌ అయింది. అంతవరకూ హ్యాపీ. సింపుల్‌గా ఏ కాంప్లికేషన్‌ లేకుండా జరిగిపోయింది.

► లక్ష్మి: నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు ఏమనిపిస్తుంది?
రానా: హైదరాబాద్‌లో పిచ్చి, పిచ్చిగా తిరిగిన పిచ్చి పిల్లాడు రానా. ఫస్ట్‌ పార్ట్‌ ఆఫ్‌ లైఫ్‌ని తీసుకుంటే వీఎఫ్‌క్స్, సినిమాలు, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్‌... ఇలా అనేక రకాలుగా రూపాంతరం చెందాను. ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటివారి గురించి కూడా ఆలోచించడం అలావాటు అవుతుంది. నీ జీవితాన్ని కూడా అవతలి వారి దృష్టికోణంలో నుంచి చూడటం అలవాటవుతుంది. పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని నన్నో ఫ్రెండ్‌ అడిగితే, పెళ్లికి రెడీ అయ్యాననుకున్నప్పుడు చేసుకుంటానన్నాను. ఆ టైమ్‌ ఇప్పుడు వచ్చిందనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఊహించుకుంటాం. ఎన్నో లెక్కలేసుకుంటాం. అవన్నీ తప్పే. ఏం జరగాలో అదే జరుగుద్ది. అందుకు ఓ ఎగ్జాంపుల్‌ నా పెళ్లి.

మరిన్ని వార్తలు