చైనాలో సంచలనం.. తొలిరోజే రూ. 15 కోట్లు!

6 May, 2017 09:05 IST|Sakshi
చైనాలో సంచలనం.. తొలిరోజే రూ. 15 కోట్లు!

చైనాలో భారతీయ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటుంది. ఈ విషయాన్ని ఆమిర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా దంగల్ మళ్లీ నిరూపించింది. అక్కడ విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ. 15 కోట్ల కలెక్షన్లు సాధించింది. 3 ఇడియట్స్ సినిమాను చైనీస్ భాషలోకి డబ్బింగ్ చేసి విడుదల చేసినప్పటి నుంచి ఆమిర్ ఖాన్ సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ కనిపిస్తోంది. పీకే సినిమా కూడా కేవలం చైనా బాక్సాఫీసులోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. దాంతో దంగల్ ఎప్పుడు వస్తుందా అని అక్కడ జనాలు బాగా ఎదురు చూసినట్లుంది. చైనాలోని అతిపెద్ద సినిమా ఆపరేటర్ 'వాండా' ఈ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించినా.. 7వేల స్క్రీన్లలో దంగల్ సినిమా రిలీజైంది. సినిమా విడుదల చేయడానికి ముందు దాని ప్రమోషన్ కోసం బీజింగ్, షాంఘై, చాంగ్‌డు నగరాల్లో ఆమిర్ ఖాన్ పర్యటించారు. ఎక్కువగా హాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించే చైనా మార్కెట్లో బాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటాయని ఆమిర్ ఇప్పటికే నిరూపించారు.

దానికి తోడు ఇటీవలే చైనా కూడా అక్కడ ఏడాదికి ప్రదర్శించే భారతీయ సినిమాల సంఖ్యను రెండు నుంచి నాలుగుకు పెంచింది. చైనా కొత్త సంవత్సరం సమయంలో వచ్చిన జాయింట్ ప్రొడక్షన్ సినిమాలు కుంగ్‌ఫూ యోగా, బడ్డీస్ ఇన్ ఇండియా లాంటి సినిమాలకు కూడా అక్కడ మంచి ఆదరణ కనిపించింది. జాకీచాన్‌తో పాటు సోనూసూద్ లాంటి కొందరు భారతీయ నటులు కలిసి చేసిన కుంగ్‌ఫూ యోగా ఇక్కడ పెద్ద హిట్ కాకపోయినా, అక్కడ మాత్రం బాగానే వసూలుచేసింది. చైనాలో ఏడాదికి 34 విదేశీ సినిమాలు మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉంది. అందులో భారతీయ సినిమాల కోటాను చాలా ఏళ్ల పాటు రెండుకే పరిమితం చేశారు. ఈమధ్యే దాన్ని డబుల్ చేశారు. చాలావరకు కోటా హాలీవుడ్ సినిమాలకే వెళ్తుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ సినిమాలను చైనాలో నేరుగా విడుదల చేయడానికి వీల్లేదు. పీకే సినిమాకు మంచి వసూళ్లు వచ్చినప్పటి నుంచి చైనా మార్కెట్లో మన సినిమాలను విడుదల చేయడానికి భారతీయ నిర్మాతలు మంచి ఉత్సాహం చూపిస్తున్నారు.

>