‘దర్బార్‌’ కష్టాలు; డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన

5 Feb, 2020 13:11 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ‘దర్బార్‌’ సినిమాతో దాదాపు రూ.70 కోట్లు నష్టపోయామని పంపిణీదారులు తెలిపారు. దీంతో ఈ చిత్ర పంపిణీదారులు హీరో రజనీకాంత్‌ను కలవడానికి చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆయనను కలవకుండా వారిని అడ్డుకోవడంతో నిరాహార దీక్ష చేయాలని పంపిణీదారులు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత శనివారం తాము రజనీకాంత్‌ను కలిసేందుకు చెన్నైలోని ఆయన ఇంటికి వెళ్లామని చెప్పారు. ఇంటి సమీపంలోకి వెళ్లగానే పోలీసులు లోపలికి వెళ్లకుండా తమను అడ్డుకున్నారని, రజనీకాంత్‌ కూడా తమను కలవడాని ఇష్టపడలేదని చెప్పారు. దీంతో  తాము నిరాశకు గురయ్యామన్నారు. ఈ క్రమంలో నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు పంపిణీదారులు తెలిపారు. కాగా గతంలో రజనీ నటించిన లింగా చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా రజనీ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు.

దర్బార్‌ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టమా?

కాగా రూ. 200 కోట్లతో నిర్మించిన దర్బార్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు వసూలు చేసినప్పటికీ భారీ డిజాస్టర్‌గా నిలిచి పంపిణి దారులకు నష్టాన్నిచ్చింది. అయితే ఈ సినిమాకు రజనీ రూ. 108 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు ఎఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించారు. ఇక గజిని, కత్తి వంటి సూపర్‌ హిట్లను అందించిన మురుగుదాస్‌.. రజనీతో తీసిన మొదటి సినిమా ఇది.

మరిన్ని వార్తలు