దర్బార్‌ : మూవీ రివ్యూ

9 Jan, 2020 15:11 IST|Sakshi
Rating:  

టైటిల్‌: దర్బార్‌
జానర్‌: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: రజనీకాంత్‌, నయనతార, నివేదా థామస్‌, యోగిబాబు, సునీల్‌ శెట్టి, 
సంగీతం: అనిరుద్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏఆర్‌ మురుగదాస్‌
బ్యానర్‌: లైకా ప్రొడక్షన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనదైన స్టైల్‌లో బాక్సాఫీస్‌ వద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించాడు. దర్బార్‌ సినిమాతో బాక్సాఫీస్‌ బరిలో పందెంకోడిలా దూకాడు. ఇది డబ్బింగ్‌ సినిమా అయినా.. తెలుగులో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్‌ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో స్టార్‌ దర్శకుడు మురగదాస్‌ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్‌ నటిస్తున్న సినిమా కావడం.. సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ‘దర్బార్‌’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు రజనీ సరసన నయనతార నటిస్తుండటం.. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో ఆదిత్య అరుణాచలంగా రజనీ తనదైన లుక్స్‌తో మెస్మరైజ్‌ చేయడం సినిమాపై అంచనాలను పెంచింది. సంక్రాంత్రి కానుకగా తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘దర్బార్‌’ ఏమేరకు ప్రేక్షకుల మెప్పించిందో తెలుసుకుందాం పదండి...

కథ:
ముంబై పోలీసు కమిషనర్‌ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్‌) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్‌స్టర్‌లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్‌కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్‌ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్‌ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్‌, హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ గ్యాం‍గ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్‌ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్‌ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్‌, మొబ్‌స్టర్‌ అయిన హరిచోప్రా (సునీల్‌ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ..

నటీనటులు:
దక్షిణాది వెండితెరపై ఇప్పటికీ తిరుగులేని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆయనకు వయస్సు పెరుగుతున్నా.. రోజురోజుకు స్టామినా మాత్రం తగ్గడం లేదు. తనదైన స్టైల్‌, గ్లామర్‌, యాక్టింగ్‌, పంచ్‌ డైలాగులతో రజనీ ఇప్పటికీ వెండితెరమీద ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘దర్బార్‌’ కూడా పూర్తిగా రజనీ స్టైల్‌, మ్యానరిజమ్స్‌, పంచ్‌ డైలాగుల మీద ఆధారపడింది. ముంబై పోలీసు కమిషనర్‌గా రజనీ లుక్‌, స్టైల్‌, మ్యానరిజమ్స్‌ ఫ్యాన్స్‌తో అదరహో అనిపిస్తాయి. పోలీసు కమిషనర్‌గా రౌడీ మూకలను రప్ఫాడిస్తూనే.. ఇటు నయనతారతో మనస్సు గెలిచేందుకు ప్రయత్నించే పాత్రలో రజనీ అదరగొట్టాడు. తన ఏజ్‌కు తగ్గట్టు నడి వయస్సు పాత్ర పోషించిన రజనీ.. నయనతారతో మాట్లాడేందుకు, ఆమె ప్రేమ గెలిచేందుకు పడే పాట్లు ప్రేక్షకులను నవిస్తాయి. ఇక, హీరోయిన్‌గా నయనతార పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఇది ప్రధానంగా తండ్రీ-కూతురు మధ్య సెంటిమెంట్‌ కథ. తండ్రిగా రజనీ, కూతురిగా నివేదా థామస్‌ తెరపై అద్భుతంగా ఒదిగిపోయారు. స్నేహితుల్లా ఉండే తండ్రీ-కూతురు మధ్య సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. సెంకడాఫ్‌లో ఇద్దరి పాత్రలు, అభినయం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. ఇక, విలన్‌గా సునిల్‌ శెట్టి ఓ మోస్తరుగా నటించాడు. రజనీ స్థాయికి తగ్గ విలన్‌ అయితే కాదు. యోగిబాబు కామెడీ అంతంతమాత్రమే ఉండగా.. ముంబై నేపథ్యం కావడంతో ఎక్కువశాతం నటులు కొత్తవాళ్లు, బాలీవుడ్‌ వాళ్లు సినిమాలో కనిపిస్తారు. 

విశ్లేషణ:
రజనీకాంత్‌ను మరోసారి తెరమీద పోలీసు ఆఫీసర్‌గా చూపిస్తూ మురగదాస్‌ తీసుకొచ్చిన ‘దర్బార్‌’ సినిమాలో కథ అంత బలంగా కనిపించదు. ఇలాంటి రివేంజ్‌  డ్రామా కథలతో ఇప్పటివరకు చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏమిటంటే అది కచ్చితంగా రజనీకాంత్‌. ప్రతి ఫ్రేములోనూ రజనీని స్టైలిష్‌గా చూపించడంలో, రజనీ స్టైల్స్‌, మ్యానరిజమ్స్‌ ఉపయోగించుకోవడం దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కానీ, కథ కొత్తది కాకపోవడం, క్లైమాక్స్‌ రోటిన్‌గా ఉండటంతో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా కొంత బోర్‌ కొట్టవచ్చు. ఇక, సెకండాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించినట్టు అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ వరకు సినిమా బాగున్నా.. క్లైమాక్స్‌ రోటిన్‌గానే అనిపిస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలం అనిరుద్‌ అందించిన నేపథ్య సంగీతం. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లను అనిరుద్‌ ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లో వచ్చే ఫైట్‌ సీన్‌లో ఫైట్‌ స్టైలిష్‌గా ఉండటంతోపాటు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సూపర్బ్‌గా అనిపిస్తుంది. అయితే, డబ్బింగ్‌ సినిమా కావడంతో పాటలు చాలావరకు రణగొణధ్వనుల్లా అనిపిస్తాయి. ఇక, సినిమాటోగ్రఫి బాగుంది. సినిమా నిర్మాణ విలువలూ రిచ్‌గా ఉన్నాయి. మొత్తానికీ ఈ సినిమా రజనీ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పవచ్చు. 

బలాలు
రజనీకాంత్‌ స్టైలిష్‌ లుక్‌, మ్యానరిజమ్‌
కూతురిగా నివేదా థామస్‌ నటన
బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

బలహీనతలు
రజనీ స్థాయికి తగ్గట్టు కథ బలంగా లేకపోవడం
ఒకింత రోటిన్‌ కథ కావడం, రోటిన్‌ క్లైమాక్స్‌

- శ్రీకాంత్‌ కాంటేకర్‌
 

Rating:  
(3/5)
Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు