ఆర్య చూసి హీరో అవ్వాలనుకున్నా

5 Sep, 2019 06:13 IST|Sakshi
తనిష్క్‌ రెడ్డి

‘‘నాది నల్గొండ జిల్లా. మా నాన్నగారు రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్‌. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. ‘ఆర్య’ సినిమా చూసి హీరో కావాలని నిర్ణయించుకుని బరువు తగ్గాను. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా’’ అని తనిష్క్‌ రెడ్డి అన్నారు. ఎలక్సియస్, శుభంగి పంత్‌ హీరోయిన్లుగా తనిష్క్‌ రెడ్డి హీరోగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్పణం’. క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా తనిష్క్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆ ఐదుగురు, దునియా, చక్కిలిగింత’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. అల్లు అర్జున్‌గారితో ‘ఐయామ్‌ దట్‌ చేంజ్‌’ అనే షార్ట్‌ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. ‘సకల కళావల్లభుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న టైమ్‌లో రామకృష్ణగారు కలిసి, ముందుగా ఇంటర్వెల్‌ సీన్‌ చెప్పారు. ఆ తర్వాత మొత్తం కథ చెప్పారు.  అద్భుతంగా ఉంది.


అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక హత్య కేసులో ఇరుక్కుంటాడు. చివరికి దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అనేది కథాంశం. సినిమా మొత్తం హత్య నేపథ్యంలో ఉంటుంది. ద్వితీయార్ధం ట్విస్ట్‌లతో భయపెడుతుంది. ఈ సినిమా మర్డర్‌ మిస్టరీకి సంబంధించిన క్లూ అద్దంలోనే కనిపిస్తుంది. అందుకే ‘దర్పణం’ అనే టైటిల్‌ పెట్టాం. మంచి టెక్నీషియన్స్‌ ఉంటే తక్కువ బడ్జెట్‌ లో సినిమా ఎంత బాగా తీయొచ్చు అనడానికి మా సినిమా ఒక ఉదాహరణ. ప్రస్తుతం క్రైమ్‌ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. ప్రేమకథతో ఓ సినిమా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో మరో సినిమా చేయబోతున్నాను. డిసెంబర్‌ నుంచి ఈ చిత్రాల  షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు