దర్శకుడు అందరికీ లైఫ్‌ ఇస్తాడు

30 Jul, 2017 01:00 IST|Sakshi
దర్శకుడు అందరికీ లైఫ్‌ ఇస్తాడు

అల్లు అర్జున్‌
‘‘ఫైట్‌ మాస్టర్‌ ఫైట్‌ తీస్తాడు, డ్యాన్స్‌ మాస్టర్‌ డ్యాన్స్‌ చేస్తాడు, యాక్టర్స్‌ యాక్ట్‌ చేస్తాడు. మరి, దర్శకుడు ఏం చేస్తాడు? నన్నడిగితే.. అందరికీ లైఫ్‌ ఇస్తాడు’’ అన్నారు అల్లు అర్జున్‌. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్‌ నిర్మించిన ‘దర్శకుడు’ ప్రీ–రిలీజ్‌ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆగస్టు 4న ఈ సిన్మా రిలీజవుతుందని ప్రకటించిన అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘మామూలుగా 24 క్రాఫ్ట్స్‌ అంటారు. నేను 25 అంటుంటా. మొదటిది ఈగో మేనేజ్‌మెంట్‌. అందరి ఈగోనూ దర్శకుడు మేనేజ్‌ చేస్తుంటాడు. దర్శకుల్లోనే నాకిష్టమైన డైరెక్టర్‌ సుకుమార్‌. వ్యక్తిగానూ ఇష్టమే. నేను ‘ఐ లవ్యూ’ చెప్పే ఇద్దరు ముగ్గురు మగాళ్లలో సుకుమార్‌ ఒకడు. ఏడెనిమిదేళ్ల క్రితం సుకుమార్‌ బోలెడు కథలు చెప్పేవాడు. ‘నువ్వెలాగూ ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు తీస్తావ్‌. అన్నీ తీయ లేవ్‌’ అంటే... ‘ఇలాంటి కథలతో సినిమాలు నిర్మిస్తా’ అన్నాడు.

‘అనుకుంటాం గానీ... తీయగలమా?’ అన్నా. ‘నేను తీయగలను’ అన్నాడు సుకుమార్‌. తీస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్లు చూస్తుంటే సుకుమారే గుర్తొస్తున్నాడు. అందులో హీరో ప్యాకప్‌ అని చెప్పి లేచే యాటిట్యూడ్‌ అతనిదే’’ అన్నారు ‘దిల్‌’ రాజు. సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘‘1 నేనొక్కడినే’ టైమ్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరతానని అశోక్‌ వచ్చాడు. బాగా రాస్తే, జాయిన్‌ చేసుకున్నా. హ్యాపీగా దర్శకుడు కావల్సినోణ్ణి, ఈ దర్శకుడు (హరిప్రసాద్‌) తను దర్శకుడు కావడం కోసం హీరోని చేసేశాడు. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హరిప్రసాద్, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

నా వల్లే బన్నీ హీరో అయ్యాడు!
‘‘ఆర్య’ షూటింగు అప్పుడు బోటు రివర్స్‌ కావడంతో నీళ్లలో పడ్డా. నాకు ఈత రాదు. షాక్‌తో చూస్తున్నారంతా. ఇంకో క్షణమైతే పోయేవాణ్ణే. అప్పుడు ప్రాణాలకు తెగించి నీళ్లలో దూకి బన్నీ కాపాడాడు. సో, నేను నీళ్లలో పడి ఛాన్స్‌ ఇవ్వబట్టే బన్నీ నా రియల్‌ లైఫ్‌లో హీరో అయ్యాడు. లేదంటే హీరో ఎలా అవుతాడు? ‘డార్లింగ్‌... థ్యాంక్స్‌. సేవ్‌ చేశావ్‌’ అంటే... ‘ఏడు కథలివ్వు చాలు’ అని ప్రామిస్‌ చేయించుకున్నా డు. అప్పుడు నా ఈగో హరై్టంది. బన్నీతో చేస్తే కల్ట్‌ సినిమాలే చేయాలి. అలాంటి కథ దొరికినప్పుడు చేస్తా’’

>