నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి?

27 Jun, 2020 11:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ద‌ర్శ‌క‌ర‌త్న డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు కుమారులు అరుణ్ కుమార్‌, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై అన్న ప్రభు చేసిన ఆరోపణలపై దాసరి అరుణ్‌ స్పందించారు. ఇంటికి గోడ దూకి వెళ్లింది నిజమేనని, కానీ దాడిమాత్రం చేయలేదని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌ ఫిల్మ్‌ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ మధ్య ఆస్తి గొడవలు తప్ప మరేం లేవని స్పష్టం చేశారు. దాసరి ప్రభు తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు.
(చదవండి : దాసరి ఇంట పంచాయితీ: పోలీసులకు ఫిర్యాదు)

‘ఈ నెల 24న గోడ దూకి ఇంటికి వెళ్లింది నిజమే. ఇటీవల నాకు కొరియర్‌ వచ్చింది. తీసుకోవడానికి వెళ్లాను. బెల్‌ కొడితే డోర్‌ తీయలేదు. అందుకే గోడదూకాను. లోపలి వెళ్లాక ప్రభు వచ్చాడు. నా డాక్యుమెంట్‌ ఇస్తే వెళ్లిపోతానని చెప్పాను. కానీ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే నా డాక్యుమెంట్‌ తీసుకొని వెళ్లాను. నా ఇంట్లో నేను గోడ దూకితే తప్పేంటి? నేను మద్యం తాగి గోడదూకితే పడిపోవాలి కదా? పోలీసుల ముందు కొడితే అప్పుడే అరెస్ట్‌ చేసేవాళ్లు కదా? ప్రభు ఉంటున్న  ఇల్లు ముగ్గురిది. మా సోదరితో పాటు నాకు దాంట్లో పొత్తు ఉంది. అన్నయ్యకు,నాకు, సోదరికి ఎలాంటి వివాదాల్లేవు. ఆయన డిప్రెషన్‌లో ఉన్నారు. అందుకే ప్రతిసారి మీడియా, పోలీసుల దగ్గరకు వెళ్తున్నారు. ఆస్తి వివాదంపై  సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కరిస్తామంటే నాకెలాంటి అభ్యంతరం లేదు’ అని అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

జూబ్లీహిల్స్‌లోని ఇల్లు విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇల్లు నాదంటే నాదంటూ.. అరుణ్‌-ప్రభు త‌గువులాడుకుంటున్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణ్‌ అర్ధరాత్రి ఇంట్లోకి  వచ్చి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని.. అడ్డుకున్న తమపై దాడికి చేశాడని ప్రభు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మా ఇంటికి కాలింగ్‌ బెల్‌ లేదు : దాసరి ప్రభు
కాగా, దాసర్‌ అరుణ్‌ ఆరోపణపై ఆయన సోదరుడు ప్రభు స్పందించారు. తాను ఎలాంటి డిప్రెషన్‌లో లేనన్నారు. అరుణ్‌ కావాలనే అర్థరాత్రి గోడదూకి ఇంట్లోకి వచ్చాడని ఆరోపించారు. తమ ఇంటికి కాలింగ్‌ బెల్‌ లేదని, అలాంటప్పుడు ఆయన కాలింగ్‌ బెల్‌ ఎలా కొట్టాడని ప్రశ్నించారు.తనకు ఫోన్‌ చేస్తే కచ్చితంగా గేట్లు తీసేవాడినన్నారు. అరుణ్‌ వెనుక కొంతమంది ఉండి ఇలా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. తాను ఆర్థికంగా బాగాలేనని, అందుకే సినీపెద్దలను ఆశ్రయించానని చెప్పారు. 

మరిన్ని వార్తలు