మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!

21 Oct, 2014 12:56 IST|Sakshi
దాసరి నారాయణ రావు - రామ్ చరణ్

ప్రముఖ దర్శక-నిర్మాత దాసరి నారాయణ రావు పరోక్షంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్లో సోమవారం జరిగిన  'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన సంచలన  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోందని, పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులను తాను చూడలేదని, ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని అన్నారు.  చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కావాలని అడిగితే ''సినిమా రెడీ చేసి పెట్టుకో, వారం గ్యాప్ వస్తే వేసుకో, ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు వేస్తాం'' అని అంటున్నారని చెప్పారు.

'లౌక్యం' సినిమా అద్భుతమైన వసూళ్లతో ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారన్నారు.  కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని,  దాంతో మళ్లీ 'లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారని చెప్పారు.

రామ్చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం గురించే దాసరి విమర్శించారని ఫిల్మ్నగర్ టాక్. 'లౌక్యం' మూవీ సెప్టెంబరు 26న విడుదలైంది. 'గోవిందుడు అందరివాడేలే'  అక్టోబరు 1న విడుదలైంది. దీనిని దృష్టిలోపెట్టుకొనే దాసరి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  గతంలో కూడా ఒక సందర్బంలో దాసరి, రామ్చరణ్  ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత దాసరి గానీ, రామ్ చరణ్ గానీ ఏమీ మాట్లాడలేదు.  ఇప్పుడు 'లౌక్యం' సినిమా బాగా ప్రదర్శిస్తున్నప్పటికీ రామ్చరణ్ చిత్రం కోసం దానిని థియేటర్లలో ఎత్తివేయడంతో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు.
**