చిన్న సినిమాలే ఊపిరి

5 Jan, 2017 23:58 IST|Sakshi
చిన్న సినిమాలే ఊపిరి

‘‘రెండేళ్ల కిందట మన సినిమాలు చూస్తే చాలా బాధేసింది. ఇతర భాషల సినిమా వాళ్లు కొత్త క్రియేటివిటీతో ముందుకెళుతుంటే మనం ఎక్క డున్నాం? అని మూడేళ్లుగా నాకు అనిపించింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా చూశాను. నచ్చింది. నారా రోహిత్‌ ఇతర హీరోలకు భిన్నంగా కథలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. శ్రీవిష్ణు నటన బాగుంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రల్లో సాగర్‌.కె చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌ నిర్మించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సక్సెస్‌మీట్‌లో దాసరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ– ‘‘పెద్ద సినిమాలంటే కమర్షియల్‌.

వాటి గురించి మాట్లాడటం అనవసరం. ఎప్పుడూ చిన్న చిత్రాలే ఇండస్ట్రీకి ఊపిరి. సినిమా రివ్యూలు, రేటింగుల మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకుని బాధ్యతతో రాయాలి. ఓవర్సీస్‌లో వీటి ప్రభావం ఉంటుంది. నిజాయతీ రివ్యూలు ఇచ్చేందుకు ‘గుడ్‌ ఫిల్మ్‌ ప్రమోటర్స్‌’ అని ఆరుగురితో టీమ్‌ను ఏడాదిలోపే ఏర్పాటు చేయా లనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘కథపై మేం పెట్టుకున్న నమ్మకం నిజమైంది. మరో 100 థియేటర్లను పెంచుతున్నాం’’ అని నారా రోహిత్‌ అన్నారు. దర్శక, నిర్మాతలు, శ్రీవిష్ణు, బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల, రవివర్మ తదితరులు పాల్గొన్నారు.

>