బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం

3 May, 2017 19:07 IST|Sakshi
బాహుబలి 2 చూశాక సీఎం సంచలన నిర్ణయం
భారీమొత్తంలో డబ్బులు వెచ్చించి మరీ బాహుబలి 2 సినిమాను చూసి వచ్చిన తర్వాత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని మల్టిప్లెక్సెస్, సినిమా హాలులో ఒక్కో వ్యక్తి నుంచి తీసుకునే టిక్కెట్ గరిష్ట ధరలు 200 రూపాయలకు మించకూడదని మంగళవారం నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఓ ప్రకటన వెలువరిచింది. అన్ని భాషల్లోని సినిమాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ నిబంధనలు మల్టిప్లెక్సెస్ ల్లో గోల్డ్ క్లాస్ స్క్రీన్, గోల్డ్ క్లాస్ సీట్లకు వర్తించవని తెలిసింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్ మూవీ హాల్స్ ను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు.
 
ఈ నిర్ణయం వెలువరచడానికి ఒక్క రోజు ముందే సిద్ధరామయ్య వేల రూపాయలకు పైగా వెచ్చించి తన కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి-2 సినిమా చూశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానన్న ఆయనే.. అధిక ధర చెల్లించి సినిమా చూడటంపై కర్ణాటకలో రాజకీయ వివాదం చెలరేగింది. ధరల నియంత్రణపై కన్నడ సంఘాలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే.. సీఎం అధిక ధర చెల్లించి సినిమా చూడటం వివాదాస్పదమైంది.  
 
మార్చి 15న తన బడ్జెట్ స్పీచ్ లో సిద్ధరామయ్య సినిమా టిక్కెట్ రేట్ల నియంత్రణపై నిర్ణయాన్ని ప్రకటించారు.  నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ మూవీలను ఆదుకోవడానికి అడ్మిషన్ ఫీజులను నిర్ణయించడం అవసరమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇప్పటికే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయి. నాన్-కన్నడ మూవీలకు ప్రజలు ఎక్కువగా వెచ్చిస్తున్నారని, భారీ మొత్తంలో వసూలు చేస్తున్న టిక్కెట్ ధరలతో వారు త్వరగా తమ పెట్టుబడులను రికవరీ చేసుకుంటున్నారని కర్నాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సా.రా గోవింద్ తెలిపారు. భారీగా వచ్చే ఒక్క మూవీతో 40 కన్నడ మూవీలు మరుగున పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.