శ్రీదేవి.. మీడియా కథనాలు.. ఆగ్రహం, ఆవేదన!

27 Feb, 2018 12:32 IST|Sakshi

మీడియా ఏ విషయంలోనైనా అత్యుత్సాహం ప్రదర్శించడం ఇప్పుడు పారిపాటిగా మారింది. నిజానిజాలు ధ్రువీకరించుకోకుండానే వదంతులను చిలువలు, పలువలుగా ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని చానెళ్లలో నిత్యకృత్యంగా మారింది. ఒకప్పుడు సోషల్‌ మీడియాలో పుకార్లు రేపి.. ప్రచారం చేసేవారు. ఇప్పుడు కొన్ని మీడియా చానెళ్లు  ఏ వదంతి తన దృష్టికి వచ్చినా.. నిజానిజాలు పట్టించుకోకుండా యథేచ్ఛగా ప్రసారం చేసేస్తున్నాయి. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం కొన్ని మీడియా చానెళ్లు తహతహలాడుతుండటం కూడా ఇందుకు కారణం కావొచ్చు.

తాజాగా శ్రీదేవి మృతి విషయంలో కొన్ని జాతీయ చానెళ్లు, మరికొన్ని ప్రాంతీయ చానెళ్లు వ్యవహరిస్తున్న తీరు, అనుమానాలకు మరిన్ని వదంతులు జోడించి అందిస్తున్న కథనాలు శ్రీదేవి అభిమానులను గాయపరుస్తున్నాయి. దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించిన శ్రీదేవి భౌతికకాయం తరలింపు విషయంలో ఆ దేశ చట్టాలకు అనుగుణంగా జాప్యం జరుగుతోంది. మొదట శ్రీదేవి తీవ్ర గుండెపోటుతో చనిపోయారని కథనాలు వచ్చాయి. కానీ, ఫోరెన్సిక్‌ నివేదికలో ఆమె బాత్‌టబ్‌లో పడి ఊపిరాడక మృతిచెందినట్టు తేలింది. ఈ ఘటన వెనుక పూర్వాపరాలు, అసలు శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగిందన్నది తేల్చేందుకు దుబాయ్‌ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ లోపు జాతీయ మీడియా శ్రీదేవి మృతి విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కథనాలు ప్రచురిస్తోంది.

దుబాయ్‌లో శ్రీదేవి మృతిచెందిన కథనాలను మొదటినుంచి ఎప్పటికప్పుడు అందిస్తూ.. స్థానికంగా ఉండి వాస్తవాలను అందించేందుకు ప్రయత్నిస్తున్న స్థానిక మీడియా సంస్థ ఖలీజ్‌ టైమ్స్‌ తాజాగా భారత మీడియా ధోరణిపై ఘాటుగా స్పందించింది. శ్రీదేవి మృతి విషయంలో ముందుగానే నిర్ధారణలకు వచ్చేందుకు, జడ్జి పాత్ర పోషించేందుకు భారత మీడియాలోని కొన్ని సెగ్మెంట్స్‌ ప్రయత్నిస్తున్నాయని ఘాటుగా అభిప్రాయపడింది.

‘భారతీయ నటి శ్రీదేవి మృతి మమ్మల్ని కూడా దిగ్భ్రాంతపరిచింది. కానీ, ఎందుకు ఈ కేసులో ముందుగానే ఒక నిర్ధారణకు వచ్చేందుకు తాపత్రయపడుతున్నారు. మన సెలబ్రిటీ ప్యాకెడ్‌ కల్చర్‌లో భాగంగా భారత మీడియాలోని కొన్ని సెగ్మెంట్లు.. అధికారులు దర్యాప్తును పూర్తిచేయకముందే జడ్జీల పాత్ర పోషించాలని భావిస్తున్నాయి. ఈ విషయంలో సత్యమేమిటో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మునిగిపోవడం వల్ల ఆమె మరణం సంభవించిందని ఫోరెన్సిక్‌ నివేదిక తెలిపింది. ఈ విచారణ సమయంలో సంయమనం పాటించడమే ధర్మమని మేం భారత మీడియాకు సూచిస్తున్నాం’ అని ఖలీజ్‌ టైమ్స్‌ తన అభిప్రాయాన్ని తెలిపింది.

ప్రముఖ జర్నలిస్టు బర్ఖా దత్‌ కూడా శ్రీదేవి మృతి విషయంలో టీవీ చానెళ్ల ప్రసారాలను తీవ్రంగా తప్పబట్టారు. ఈ విషయంలో టీవీచానెళ్ల ప్రసారాలు సిగ్గుపడేలా ఉన్నాయని పేర్కొంటూ ‘న్యూస్‌కి మౌత్‌’ (వార్త మరణం) పేరిట ఆమె ‘వాషింగ్టన్‌ పోస్టు’లో ఓ వ్యాసాన్ని ప్రచురించారు. శ్రీదేవి మృతిపై కొన్ని చానెళ్లు అత్యుత్సాహంతో అందిస్తున్న కథనాలు, వదంతులు కలతకు గురిచేసేలా ఉన్నాయని సినీ రచయిత కోన వెంటక్‌ ట్వీట్‌ చేశారు. శ్రీదేవి మృతి విషయంలో సెన్సేషనల్‌ కథనాలు ప్రచురించేందుకు కొన్ని మీడియా చానెళ్లు తాపత్రయపడటంపై, చిలువలుపలువలుగా ప్రసారాలు సాగుతుండటంపై సోషల్‌ మీడియాలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు