దీపిక నడుముతో పెద్ద తలనొప్పి!

13 Jan, 2018 17:32 IST|Sakshi

పద్మావత్‌ చిత్ర విడుదలకు క్లియరెన్స్‌ లభించినా మేకర్లకు మాత్రం చిక్కులు తప్పటం లేదు. ఓవైపు కర్ణి సేన హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్న దర్శకనిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ.. మరోవైపు సెన్సార్‌ బోర్డు సూచనల మేరకు చిత్రానికి మరమ్మత్తులు పనిలో బిజీగా ఉన్నాడు.  ఈ క్రమంలో ఆయనకు ఓ కొత్త సమస్య ఎదురైందని తెలుస్తోంది. 

ఈ చిత్రంలో గూమర్‌ సాంగ్‌లో పద్మావతిగా దీపిక వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. కానీ, కర్ణిసేన మాత్రం ఆ పాట పై కన్నెర్ర చేసింది. రాణి పద్మావతి అలా గంతులేయటం ఏంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న సెన్సార్‌ బోర్డు ప్యానెల్‌ సభ్యులు ఆ పాటను కూడా ఎడిట్‌ చేయాల్సిందేనని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాటలో దీపిక నడుము కనిపించే షాట్లను తొలగించాలని సూచించింది. 

అయితే అది మొత్తం పాట పైనే ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భన్సాలీ ఓ నిర్ణయానికి వచ్చాడు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ ద్వారా దీపిక నడుమును కప్పిపుచ్చే యత్నం చేస్తున్నాడంట. అయితే ఈ ఎడిటింగ్‌ పనుల వల్ల చిత్రం జనవరి 25 తేదీన విడుదలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తోందని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ముందు మాకు చూపించండి : రాజస్థాన్‌ హైకోర్టు
పద్మావత్‌ చిత్రంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం రాజస్థాన్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతోపాటు దీపిక, రణ్‌వీర్‌లపైన గతేడాది మార్చిలో నగౌర్‌ జిల్లా దీవానా పోలీస్‌ స్టేషన్‌లో ఓ కేసు దాఖలైంది. అయితే ఆ అభియోగాలను కొట్టివేయాలంటూ భన్సాలీ రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన బెంచ్‌.. అభ్యంతరాల నేపథ్యంలో ముందు చిత్రాన్ని తమ ముందు ప్రదర్శించాలని..  చూసి నిర్ధారించుకున్నాకే కేసును కొట్టివేస్తామని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌ పై తదుపరి వాదనను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.   

17 నుంచి నిరసన ప్రదర్శనలు
చిత్తోర్‌ఘడ్‌ వేదికగా మరో ఉద్యమానికి రాజ్‌పుత్‌ కర్ణిసేన సిద్ధమవుతోంది. పద్మావత్‌ చిత్ర విడుదలను అడ్డుకునే దిశగా పెద్ద ఎత్తున్న ప్రయత్నాలు ప్రారంభించింది. ఆదివారం కర్ణిసేన ప్రతినిధులు హోం శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కానున్నారు. మరోవైపు కర్ణిసేన పెద్దలు 17న తేదీన పద్మావత్‌ చిత్రానికి దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు