వారికి దీపిక ఇచ్చే సలహా

24 Mar, 2018 12:53 IST|Sakshi

ఒత్తిడి, ఉరుకులు, పరుగుల జీవితం. శారీరక ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకే తీరకలేకుండా పోతున్నకాలం ఇది. ఇక మానసిక ఆరోగ్యం గురించి ఏం ఆలోచిస్తాం. ఫలితంగా కోపం, అసహనం, నిరాశ, నిస్పృహలకు లోనవడంవంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికి మన దేశంలో మానసిక ఆరోగ్యాన్ని ఒక ప్రత్యేక అంశంగా పరిగణించము. అసలు మానసిక సమస్యలతో బాధపడుతున్నామని కూడా మనలో చాలామంది గుర్తించలేరు.. ఒక వేళ గుర్తించినా బయటకు చెప్పుకోలేరు. ఈ మౌనాన్ని చేధించి, మానసిక ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోణ్‌ ‘ది లవ్‌, లీవ్‌, లాఫ్‌’ ఫౌండేషన్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్‌ మానసిక ఆరోగ్యంపట్ల దేశ ప్రజలకు ఏ మేరకు అవగాహన ఉందనే అంశం గురించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడమే కాకుండా ఆ సమస్యలను పై పోరాడటానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఈ నివేదిక విడుదల చేసిన సందర్భంగా దీపికా మాట్లాడుతూ 'నేను ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడ్డాను. ఆ సమయంలో చాలా మారిపోయాను. కారణం లేకుండా ఏడ్చేదాన్ని. ఒంటరిదాన్నని భావించేదాన్ని. ఆ విషయాన్ని నేను నా సన్నిహితులతో పంచుకున్నాను. వారి ప్రేమ, వైద్యుల సహాకారంతో  ఆ సమస్య నుంచి బయటపడ్డాను. ఆ సమయంలోనే  ఇలాంటి ఓ ఫౌండేషన్‌ను స్థాపించి ప్రజలకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అనుకున్నాను. మనలో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. కానీ బయటకు చెప్పుకోరు. అందుకు కారణం ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని. కానీ ఇందులో దాచిపెట్టి ఉంచాల్సిందేమి లేదు. ముందు మనలో జరుగుతున్న మార్పులను మనమే అర్థం చేసుకోవాలి. అందరితో చెప్పుకోక పోయినా మనల్ని నమ్మే వారి దగ్గర మన సమస్యను చెప్పుకోవాలి. అక్కడికే సగం సమస్య తీరుతుంది. ఆ తర్వాత దానికి తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

ఈ ఫౌండేషన్‌ తరుపున పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను స్వయంగా ఈ సమస్యను ఎదుర్కొన్నాను. ఆ తర్వాతే నేను నా ఆలోచనలు, భావాలు, భావోద్వేగాల గురించి మరింత అవగాహన పెంపొందించుకున్నాను. కేవలం నా గురించి మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న వారి గురించి కూడా అవగాహన పెంపొందించుకున్నాను. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి నేను ఇచ్చే సలహ ఏంటంటే ‘నేను దీన్ని ఎదుర్కొన్నాను, నాకు దీని గురించి తెలుసు, దాని నుంచి కోలుకోవచ్చు. కాబట్టి వదిలివేయకండి ప్రయత్నిస్తూనే ఉండండి స్టీఫేన్‌ ఫ్రై చెప్పినట్లు ఏదో ఒక రోజు ఆహ్లాదంగా ఉంటుంది’ అని దీపికా సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు