‘దేవీ’ షార్ట్‌ఫిల్మ్‌ ట్రైలర్‌ రిలీజ్‌

25 Feb, 2020 16:06 IST|Sakshi

ఏదైనా సరే, షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా ఉండాలి.. సాగదీసే వ్యవహారాలు అస్సలు గిట్టవు. ఇదీ ప్రస్తుత జనరేషన్‌ పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా తక్కువ సమయంలో చెప్పేయాలి. అదీ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ ఇది. దీన్ని సినీ తారలు కూడా ఫాలో అవుతున్నారు. అందుకే కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తామని గిరిగీసుకోవట్లేదు. అవకాశాలు వస్తే ప్రయోగాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లుగా ఎదిగిన చాలామంది బుల్లితెరపై హడావుడి చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి వెబ్‌ సిరీస్‌, షార్ట్‌ ఫిల్మ్స్‌లోనూ వారి సత్తా చాటుతున్నారు. (ముగ్గురికి హెల్ప్‌ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి సాయం చెయ్యమనండి)

ఈ క్రమంలో తొమ్మిది మంది సీనియర్‌ నటీమణులతో హిందీలో ఓ షార్ట్‌ ఫిల్మ్‌ రానుంది. కాజోల్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నేహా ధూపియా, నీనా కులకర్ణి, శృతీహాసన్‌, ముక్తా బావ్రే, రామా జోషీ, శివానీ రఘువంశీ, సంధ్య మాట్రే, రసశ్విని దయమ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ‘దేవి’ అని నామకరణం చేశారు. సోమవారం ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో భిన్న నేపథ్యాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే గదిలో ఉన్నారు. అయితే దానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇక రెండు కొప్పులు ఒక్కచోట ఉండలేవు అన్న చందంగా విభిన్న మనస్తత్వం గల వీళ్లు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగుతున్నారు. దీంతో వారికి సర్దిచెప్తూ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోంది కాజోల్‌. (షార్ట్‌ ఫిల్మ్‌లో శృతీహాసన్‌)

తొమ్మిది మంది మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లను ఎందుకు ఒకే గదిలో నిర్భందించారు? ఎవరు ఈ పని చేసుంటారు? అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మార్చి 2 వరకు ఆగాల్సిందే. ఈపాటికే విడుదలైన ట్రైలర్‌ అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నటులను ఒకేసారి చూడటం నిజంగా కనుల విందేనని కామెంట్లు చేస్తున్నారు. దుర్గాదేవి తొమ్మిది అవతారాలను స్ఫూర్తిగా తీసుకుని, వాటి తత్వాలను తెలియజెప్పే పాత్రలేమోనంటూ కొందరు దేవీ సినిమా కథపై వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఏదేతైనేం, టైటిల్‌ పేరే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇక స్టోరీ ఇంకెంత శక్తిమంతంగా ఉంటుందో చూడాలి. (హైదరాబాద్‌ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు)

మరిన్ని వార్తలు