ట్రెండింగ్‌లోకి రాగానే వాళ్లే సారీ చెబుతారు

11 Jan, 2020 01:50 IST|Sakshi
దేవిశ్రీ ప్రసాద్‌

‘‘మనం చేస్తున్న ప్రతి పనికీ అవార్డు వస్తుందన్న గ్యారంటీ లేదు. అలా అని వస్తేనే గొప్ప అనడం లేదు. అవార్డుల విషయంలో నా దృష్టిలో రెండు కోణాలు ఉన్నాయి. మన పని బయటకు వచ్చి ప్రేక్షకులందరికీ నచ్చినప్పుడు దాన్ని మించిన అవార్డు లేదు. అలాగే మన పనిని ఒకరు గుర్తించి పిలిచి అవార్డు ఇస్తున్నప్పడు దాన్నొక గొప్ప గౌరవంగా నేను భావిస్తాను.

ఈ గౌరవం నా బాధ్యతను పెంచుతుంది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ‘దిల్‌’ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పిన విశేషాలు..

► మహేశ్‌బాబుగారితో నేను ఐదు (1: నేనొక్కడినే (2014), శ్రీమంతుడు (2015), భరత్‌ అనే నేను (2018), మహర్షి (2019), సరిలేరు నీకెవ్వరు (2020)) సినిమాలు చేశాను. చాలా సంతోషంగా ఉంది. నేనే కాదు...మహేశ్‌గారితో పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. మహేశ్‌గారితో సినిమాలు చేసిన దర్శకులందరితో నేను పని చేయడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. ఆయన డైరెక్టర్స్‌ యాక్టర్‌. ఒక్కసారి కథ విని, ఆయన ఓకే అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా అండగా ఉంటారు. అంతపెద్ద స్టార్‌ మనపై నమ్మకం ఉంచినప్పుడు మనకు తెలియకుండానే మన పనిపై మనకు గౌరవం పెరుగుతుంది. మహేశ్‌ గారిది చిన్నపిల్లల మనస్తత్వం. ఏదైనా పాట లేదా సన్నివేశం నచ్చినప్పడు చాలా ఎగై్జటింగ్‌గా ఉంటారు. ఆ ఎగై్జట్‌మెంట్‌ వచ్చినప్పుడు ఆయన్ను పట్టుకో వడం కష్టం. ఆ లక్షణం చిరంజీవిగారిలోనూ చూశాను.
     
► ఇదివరకు మహేశ్‌గారికి నేను సంగీతం అందించిన సినిమాల్లో ఎక్కువగా ఆయన సందేశంతో కూడుకున్న బాధ్యతాయుతమైన పాత్రలు చేశారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో మంచి మాస్‌ సాంగ్స్‌ ఇస్తానని ఈ సినిమా ప్రారంభోత్సవం రోజున మహేశ్‌ అభిమానులకు ప్రామిస్‌ చేశాను. అన్నట్లుగానే మంచి పాటలు కుదిరాయి. ఈ సినిమాకే కాదు..దాదాపు నేను చేసిన అన్ని సినిమాలకు మొదటి సిట్టింగ్స్‌లోనే ట్యూన్స్‌ ఫైనలైజ్‌ అయ్యాయి. ఈ విషయంలో నేను కాస్త లక్కీ.
     
► అనిల్‌ రావిపూడిగారి ‘ఎఫ్‌ 2’ సినిమాకు నేను సంగీతం అందించాను. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. భవిష్యత్‌లో మంచి స్థాయికి వెళతాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ కథను మొదట నాకు అనిల్‌ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ విన్నప్పుడే ఈ సినిమా పాటల గురించి ఆలోచించుకున్నాను. ఎందుకంటే కథ ప్రకారం నేను పాటలు ఇవ్వడానికి ఇష్టపడతాను. అలాగే ఇస్తూ వస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా సందర్భానుసారంగానే పాటలు వస్తాయి. ఈ సినిమాలోని సైనికుల యాంథమ్‌ సాంగ్‌కు నేను లిరిక్స్‌ రాశాను.

సైనికులంటే నాకు విపరీతమైన అభిమానం. వారికి నివాళిగా ఉండాలని ఈ సాంగ్‌ చేశాం. మహేశ్‌గారు కూడా మెచ్చుకున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ‘సూర్యుడివో..చంద్రుడివో’, ‘డాంగ్‌ డాంగ్‌’ పాటలకు కూడా మంచి స్పందన లభించింది. అందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్‌. ఇక ‘మైండ్‌బ్లాక్‌’ సాంగ్‌లో మహేశ్‌గారి డ్యాన్స్‌ సూపర్బ్‌. ఆయన డ్యాన్స్‌ చూసి మేమందరం షాకయ్యాం. మహేశ్‌గారి కామెడీ టైమింగ్‌ బాగుంటుంది. అప్పుడప్పుడు ఆయన సరదాగా వెటకారంగా మాట్లాడుతుంటారు. ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌లో అలా మహేశ్‌ వాయిస్‌ పెట్టాం.

► విజయశాంతిగారితో మా నాన్నగారు (రచయిత సత్యమూర్తి) పనిచేశారు. ఇప్పుడు నేను ఆమెతో ఈ సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మహేశ్, విజయశాంతిగార్ల మధ్య సన్నివేశాలు భలేగా ఉంటాయి. అలాగే మహేశ్,  ప్రకాష్‌రాజ్‌గార్ల  సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి.

► నా పాటలు బాగున్నాయో లేదో నా టీమ్‌ని నిర్మొహమాటంగా చెప్పమంటాను. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్‌ ఉంటోంది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. అయితే నా పాటలపై నిజాయతీగా చెప్పేవారి అభిప్రాయాలను గౌరవిస్తాను. ఏవైనా పొరపాట్లు ఉంటే మళ్లీ జరగకుండా జాగ్రత్తపడతా. ఈ సందర్భంగా ఓ విషయం చెబుతాను.‘బాహుబలి’ సినిమా నా అంచనాల తగ్గట్లు లేదు’ అని నాతో ఎవరో అన్నారు. ఆ తర్వాత ‘బాహుబలి’ ఎక్కడికి వెళ్లింది? అంటే కొందరు భారీ అంచనాలు పెట్టుకుంటారు. మొదట్లో కాస్త నిరుత్సాహపడతారు. కాస్త ట్రెండింగ్‌లోకి రాగానే ఆ తర్వాత వాళ్లే సారీ చెబుతారు.

► సంగీతంపై నాకున్న ప్రేమవల్ల హీరోగా చేయలేకపోతున్నానేమో. తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేద్దామనుకుంటున్నా. ∙‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్, నా కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది. ఈ చిత్రానికి 3 పాటలు కంపోజ్‌ చేశా. ‘గుడ్‌లుక్‌ సఖి’, ‘రంగ్‌ దే’, ‘ఉప్పెన’ చిత్రాలకు మ్యూజిక్‌ అందించబోతున్నాను. ఓ హిందీ సినిమా చేయబోతున్నా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా