30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా

25 Apr, 2019 02:33 IST|Sakshi

– జమున

నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై రాము రాథోడ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్‌ నటి జమున కెమెరా స్విచ్చాన్‌ చేయగా,  నిర్మాత సి.కళ్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్‌ షాట్‌కి దర్శకత్వం వహించారు. జమున మాట్లాడుతూ–  ‘‘నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది.

రిటైర్‌ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఇది కాకుండా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. శివనాగు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయాలనుకునే ముందు విజయవాడ మొత్తం తిరిగి వివరాలు తెలుసుకున్నాను. 1977లోని కథ ఇది. మే 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి, పెదనాన్నలాంటివారు నెహ్రూగారు. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు తారకరత్న. ‘‘దేవినేని చిత్రాన్ని నిర్మిస్తుండటం నా అదృష్టం’’ అన్నారు రాము రాథోడ్‌.

మరిన్ని వార్తలు