నేను పర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదు : ధనుష్‌

12 May, 2019 10:08 IST|Sakshi

నేను ఫర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌. ఏంటీ? నటుడిగా దక్షిణాదిలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్‌ స్థాయికి చేరుకున్న ఈ స్టార్‌ నటుడు పర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదంటున్నారేమిటని ఆశ్చర్య పోతున్నారా? మీరేమైనా అనుకోండి ధనుష్‌ పర్ఫెక్ట్‌ మ్యాన్‌ కాదన్న మాట వాస్తవం. సరిగ్గా 17 ఏళ్ల  క్రితం 2002, మే 17న ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై తెరపైకి వచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతే కాదు ధనుష్‌ జీవితాన్నే మార్చేసిన చిత్రం తుళ్లువదో ఇళమై.

ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. నటుడిగా ధనుష్‌ వయసు 17 ఏళ్లు అన్నమాట. దీంతో ఆయన అభిమానులు ఆ చిత్ర పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి పండగ చేసుకుంటున్నారు. వారి అభిమానానికి స్పందించిన ధనుష్‌ ట్విట్టర్‌లో పేర్కొంటూ తుళ్లువదో ఇళమై చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్న విషయాన్ని  నమ్మలేకపోతున్నాను. ఏమీ తెలియని చిన్న కుర్రాడిగా ఉన్న నాకు మీ గుండెల్లో చోటు ఇచ్చారు. నటుడిని అవలేనని భావించిన నన్ను ఒక స్టార్‌ను చేశారు. అంతా నిన్న జరిగినట్లు ఉంది.

నా జయాపజయాలన్నింటిలోనూ మీరు ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను పర్ఫెక్ట్‌ మ్యాన్‌నే కాదు. అయితే మీ ప్రేమాభిమానాలే నన్ను పరిపూర్ణ వ్యకిగా తీర్చిదిద్దాయి.  మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా తొలి చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్నది మీరు పోస్ట్‌ చేసిన పోస్టర్లు చూసి నేను మరింత ఉత్తేజం పొందాను. ఈ అభిమానం ఎల్లప్పుడు ఉండాలి. ప్రేమను వ్యాప్తి చేయండి, ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అని ధనుష్‌ పేర్కొన్నారు. ఈ 17 ఏళ్లలో ధనుష్‌ ఒక నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మలచుకుని ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు