వీఐపీ 3,4 సీక్వెల్స్‌ వస్తాయి

10 Jul, 2017 02:35 IST|Sakshi
వీఐపీ 3,4 సీక్వెల్స్‌ వస్తాయి

తమిళసినిమా:  వీఐపీ చిత్రానికి మూడు, నాలుగు సీక్వెల్స్‌ తెరకెక్కించనున్నట్లు నటుడు ధనుష్‌ వెల్లడించారు. ఆయన నటించిన వీఐపీ( వేలై ఇల్లా పట్టాదారి) చిత్రం పెద్ద విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఆ చిత్రం రఘువరన్‌ బీటెక్‌ పేరుతో తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.

కాగా వీఐపీకి సీక్వెల్‌గా వీఐపీ–2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నటుడు ధనుష్‌ కథ, మాటలు అందించి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అమలాపాల్‌ నాయకిగా నటించారు. కాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్‌.థాను వి క్రియేషన్స్, ధనుష్‌ వండర బార్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సౌందర్యరజనీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్‌ రోల్డన్‌ సంగీతాన్ని అందించారు. వీఐపీ 2 చిత్రం ఈ నెల 28న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే చిత్ర ఆడియో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. చిత్ర ట్రైలర్‌ను 8 మిలియన్ల ప్రేక్షకులను అలరించి రికార్డు సాధించిందని చిత్ర వర్గాలు తెలిపారు.

శనివారం సాయంత్రం స్థానిక రాయపేటలోని సత్యం సినిమామాల్‌లో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు ధనుష్‌ మాట్లాడుతూ వీఐపీ చిత్రం గానీ, వీఐపీ–2 చిత్రం గానీ ఒక హీరోనో, హీరోయిన్‌నో ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రాలు కావన్నారు. ఈ రెండూ తల్లి ప్రేమానుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రాలని తెలిపారు. వీఐపీ చిత్రం మాదిరిగానే వీఐపీ–2 చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందని చెప్పారు. దీనికి 3,4 భాగాలు కూడా రూపొందుతాయని తెలిపారు. వీఐపీ చిత్రానికి, రెండవ భాగానికి వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రానికి షాన్‌ రోల్డన్‌ను సంగీతదర్శకుడిగా ఎంచుకున్నామని వివరించారు. ఇక ఇంతకు ముందు తన దర్శకత్వంలో చక్కని భావోద్రేకాలతో కూడిన కథా చిత్రంగా రూపొందిన పా.పాండి చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని చెప్పారు.

ఇకపై తమిళంలో నటిస్తా
కాజోల్‌ మాట్లాడుతూ సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తమిళంలో వీఐపీ–2 చిత్రంలో నటించానన్నారు. వీఐపీ 2 చిత్రం వేరే కోణంలో ఉంటుందన్నారు. వీఐపీ 2ను సౌందర్యరజనీకాంత్‌ చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. ప్రస్తుతం సినిమా ఆధునికం వైపు పరుగులు తీస్తోందని, దానితో పాటు మనం మారాలని అన్నారు. ఇకపై తమిళంలో వరసగా నటించాలని ఆశపడుతున్నానని, మంచి కథ, నిర్మాణ సంస్థలు అమరితే తమిళంలో నటిస్తానికి రెడీ అని పేర్కొన్నారు.

ధనుష్‌ నాకు గురువు
చిత్ర దర్శకురాలు సౌందర్య రజనీకాంత్‌ మాట్లాడుతూ ధనుష్‌ తనకు గురువు అని పేర్కొన్నారు.తనకంటే సీనియర్‌ అని, ఆయనతో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించిన ధనుష్‌కు, నిర్మాత థానుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్‌.థాను,సహ నిర్మాత పరంథామన్, సంగీతదర్శకుడు షాన్‌రోల్డన్, నటుడు సముద్రకని పాల్గొన్నారు.