కరోనాను టార్గెట్‌ చేసిన డించక్‌ పూజా

20 Mar, 2020 09:28 IST|Sakshi

యూట్యూబ్‌ సెన్సేషన్‌ డించక్‌ పూజా గుర్తుందా? అంత ఈజీగా మరిచిపోయే గొంతా? ఆమె తన గళం విప్పి దానికి పాదాలు కదిపి డ్యాన్స్‌ చేసిందంటే ప్రపంచమే గడగడలాడిపోతుంది. కర్ణకఠోరమైన గొంతుతో, భయంకరమైన డ్యాన్స్‌తో యూట్యూబ్‌లో పాపులర్‌ అయింది. తాజాగా ఆమె దృష్టి అందరి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్న కరోనా వైరస్‌పై పడింది. ఇంకేముందీ.. దానిపై ఓ పాట కట్టి.. కొంతమందికి డాక్టర్ల గెటప్‌ వేయించి డ్యాన్స్‌ చేసింది(ప్రయత్నించిందంటే బాగుంటుందేమో). ఈ వీడియోలో ముందుగా వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. చేతులు శుభ్రం చేసుకోవడం, ఎవరినీ తాకకపోవడం, సామాజిక ఎడం పాటించడం, అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇంట్లోనే ఉండటం వంటి నాలుగు సూత్రాలు పాటించి దాని వ్యాప్తిని నివారించవచ్చని సూచించింది. (ఆమె డ్యాన్స్‌ చూస్తే నిజంగానే పిచ్చెక్కుతుంది)

‘చేయండి చేయండి.. మీ పని మీరు చేయండి.. ప్రార్థనలు చేయండి.. ఎవరికీ ఏమీ కాకుండా చూసుకోండి’ అంటూ క్యాచీ లైన్లతో పాట కట్టింది. ఎందుకైనా మంచిది.. సంగీత ప్రియులు కాస్త గుండె ధైర్యం తెచ్చుకుని ‘హోగా నా కరోనా’ సాంగ్‌ను పూర్తయ్యేవరకు చూడండి. యూట్యూబ్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఓ కరోనా.. ఒక్కసారి ఈ పాట వినవమ్మా.. విన్నావంటే నువ్వు చావడం ఖాయమమ్మా’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘నీ వీడియోలు చూసే మాకు ఏడుపొక్కటే తక్కువ’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. కాస్త వెరైటీ, మరికాస్త వినోదం కావాలనుకుంటే ఈ కరోనా పాటపై మీరూ ఓ లుక్కేయండి. ఆల్‌ ద బెస్ట్‌. (రాజమౌళి దర్శకత్వంలో రానా?)

మరిన్ని వార్తలు