అవును.. హీరోలం మారుతుండాలి!

12 Dec, 2016 14:41 IST|Sakshi
అవును.. హీరోలం మారుతుండాలి!

‘‘ఎప్పుడూ ట్యాంక్ బండ్‌లో బుద్ధుడి విగ్రహంలా కాకుండా.. మేము (హీరోలం) మారుతుండాలి. గత సినిమాల ఇమేజ్, విజయాలను పట్టించుకోకూడదు. కథను బట్టి ముందుకు వెళ్లాలి’’ అన్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించిన ‘ధృవ’ రిలీజ్ రేపు. రామ్‌చరణ్ చెప్పిన విశేషాలు...
 
► ప్రతి సినిమా విడుదల ముందు టెన్షన్ పడడం సహజమే. రీమేక్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ పడుతున్నా. అల్రెడీ తమిళంలో హిట్టయిన సినిమా అయినా, అలవాటైన హీరో సెంట్రిక్ ఫిల్మ్ కాదు కదా!
► ఎన్వీ ప్రసాద్‌గారు చెప్పడంతో ‘తని ఒరువన్’ చూశా. కొత్తగా ఉంటుందనుకున్నా. పైగా, పక్కా మాస్ ఏరియా అయిన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ (ఎన్వీ ప్రసాద్) నన్ను కొత్తగా చూడాలనుకుంటున్నారు. దాంతో ఓకే చేశా. కథను నమ్మాను. నా క్యారెక్టర్, స్క్రీన్‌ప్లే డిఫరెం ట్‌గా ఉంటాయి. రీమేక్, పోలీస్ పాత్ర- అవేవీ ఆలోచించలేదు. కథలో చాలా మార్పులు చేశాం.
► అరవింద్‌స్వామి పాత్ర నిడివి తగ్గుతోంది. కానీ, ఆయన తప్ప సిద్ధార్థ్ అభిమన్యు పాత్రకు మరో ఆప్షన్ కనిపించలేదు. ఆయనతో మంచి బాండింగ్ ఏర్పడడం వల్ల సీరియస్ సీన్స్ చేయడం నాకు కష్టమైంది.
► ‘మళ్లీ రకులే హీరోయిన్ కదా’ అని అడుగుతున్నారు. హీరోయిన్లు ఎవరున్నారు చెప్పండి. ‘నాన్నకు ప్రేమతో’, ఇతర సినిమాల్లో రకుల్ బాగా నటించింది కదా!
►నేను మెథడ్ యాక్టర్‌ని కాదు. ప్రతి సినిమా ఓ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. సిక్స్‌ప్యాక్ ఎప్పుడో చేయాల్సింది.  
► పెద్ద నోట్ల ఉపసంహరణ వల్లే ఈ నెల 2 నుంచి 9కి విడుదల తేదీని మార్చాం. ప్రస్తుతం రిలీజవుతోన్న పెద్ద సినిమా మాదే. ఆ ప్రభావం ఎంతవరకూ ఉంటుందో చూడాలి!
►సుకుమార్ సినిమా సంక్రాంతి తర్వాత, బాబాయ్ (పవన్‌కల్యాణ్) నిర్మాతగా చేసే సినిమా వచ్చే ఏడాది ఉంటాయి. ముందు ఇద్దరి చేతిలోనూ ఉన్న సినిమాలు పూర్తవ్వాలి. దర్శకులు మణిరత్నం, కొరటాల శివలతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
► ప్రస్తుతానికి తెలుగులోనే చేస్తా. హిందీలో నటించే ఆలోచన ఏదీ లేదు.
 
డాడీతో మళ్లీ డ్యాన్స్ చేశా!
‘ఖైదీ నంబర్ 150’లో తళుక్కున మెరుస్తా. నాన్నగారి (చిరంజీవి) తో కలసి ఓ పాటలో డ్యాన్స్ చేశా. ఈ రోజుతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. క్రిస్మస్‌కి పాటల్ని విడుదల చేస్తాం. జనవరి 11.. 12 తేదీల్లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం.