‘15 ఏళ్లుగా రాజు సర్‌ నాకు తెలుసు’

14 Jan, 2019 20:35 IST|Sakshi

ముంబై: ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం పట్ల హీరోయిన్‌ దియా మిర్జా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అధికారిక విచారణ జరగాలని ఆమె ఆకాంక్షించారు. ‘ఈ వార్త విని చాలా బాధ పడ్డాను. 15 ఏళ్లుగా రాజు సర్‌ నాకు తెలుసు. ఆయనను ఎంతో గౌరవిస్తాను. నేను పనిచేసిన వారిలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి ఆయన. పూర్తి వివరాలు తెలియకుండా దీని గురించి వ్యాఖ్యానించలేను. ఈ వ్యవహారంపై అధికారిక దర్యాప్తు జరగాల’ని దియా మిర్జా అన్నారు. రాజ్‌కుమార్‌ హిరానీ తెరకెక్కించిన లగే రహో మున్నాభాయ్‌, సంజు సినిమాల్లో ఆమె నటించారు.

హిరానీ తనను లైంగికంగా వేధించారంటూ ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో తనను పలుమార్లు వేధించారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. దర్శకులు సాజిద్‌ ఖాన్‌, వికాస్‌ బల్‌, సీనియర్‌ నటులు అలోక్‌నాథ్‌, నానాపటేకర్‌, సంగీత దర్శకుడు అనుమాలిక్‌ తదితరులు ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు