వందేళ్లు బతకాలని ఉంది: హీరో

22 Dec, 2016 09:38 IST|Sakshi
తనకు వందేళ్లు బతకాలని ఉందని, అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నానని సీనియర్ నటుడు డిక్ వాన్ డైక్ చెబుతున్నారు. ఇప్పటికే 91 ఏళ్ల వయసున్న ఈ హీరో.. తాను ఏమాత్రం ముసలాడినని అనుకోవడం లేదని, 2025లో తన పుట్టినరోజు జరుపుకోవడం కోసం పనిచేస్తూనే ఉంటానని అంటున్నారు. వందో పుట్టినరోజు జరుపుకోడానికి కృషి చేస్తున్నానని, ఇప్పటికీ ప్రతిరోజూ డాన్సు చేస్తూ, జిమ్‌కు వెళ్తున్నానని చెప్పారు. మానసిక పరంగా అయితే అసలు తాను ముసలివాడినని ఏమాత్రం అనుకోవడం లేదన్నారు. 
 
తన వయసువారే అయిన చాలామంది హాలీవుడ్ స్టార్లు కూడా బతికుంటే బాగుండేదని ఆయన చెప్పారు. తన సమకాలీకులు కావాలని అనిపిస్తోందని, కానీ వాళ్లలో చాలామంది ఇప్పుడు లేరన్న విషయమే తనను బాధపెడుతోందని తెలిపారు. కొద్ది మంది మాత్రం ఇప్పటికీ కలుస్తుంటారని, వాళ్లలో తన మెంటార్ అయిన కార్ల్ రీనర్ (94), మెల్ బ్రూక్స్ లాంటివాళ్లు ఉన్నారని తెలిపారు. గతంలో తాము చేసిన పనులు తమ వర్తమానం మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయన్న విషయం గురించే తాము ఎక్కువగా మాట్లాడుకుంటామన్నారు. అప్పుడు చేసిన తప్పులను గుర్తుచేసుకుంటామని, ఎలాగైనా పాత రోజులు అద్భుతంగా ఉండేవని డైక్ తెలిపారు.