అభిమానుల... డిక్టేటర్

15 Jan, 2016 00:23 IST|Sakshi
అభిమానుల... డిక్టేటర్

తారాగణం: బాలకృష్ణ, అంజలి, కథ -స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, కెమేరా: శామ్ కె. నాయుడు, సంగీతం: తమన్, నిర్మాత: ఈరోస్ ఇంటర్నేషనల్, సహ నిర్మాత, దర్శకత్వం: శ్రీవాస్
 
పవర్‌ఫుల్ టైటిల్స్ పెట్టుకోవడం ఒక ఎత్తు. అంతకు అంత పవర్‌ఫుల్ డైలాగులు చెబుతూ, అలవాటైన హావభావాలతో నటించి, మెప్పించడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ జగమెరిగిన నటుడు బాలకృష్ణ. ‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ తరువాత ఇప్పుడు ఆయన ‘డిక్టేటర్’ని అన్నారు. సామాన్యుడిలా ప్రశాంత జీవితం గడిపే హీరో... ఎవరినో, ఎలాగో రక్షిస్తున్న టైమ్‌లో అతను సామాన్యుడు కాదు, ఘనచరితుడని ఎవరో బయటపెట్టడం... ఆ షాకింగ్ ఘట్టం దగ్గర ఇంటర్వెల్... సెకండాఫ్ మొదలవగానే, మామూలు మనిషిగా బతుకుతున్న ఆ మహోన్నత హీరో ఘనచరిత్ర ఫ్లాష్ బ్యాక్... అది అయిపోగానే, హీరో మళ్ళీ ధర్మసంస్థాపనార్థం సామాన్యుడి వేషం వదిలేసి, విలన్లను మట్టికరిపించడం. అప్పుడెప్పుడో సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘బాషా’ రోజుల నుంచి ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్త కావు. ఈ చట్రంలోనే ‘సమరసింహారెడ్డి’ మొదలైన అనేక చిత్రాల్లో బాలకృష్ణను చూసేసిన ప్రేక్షకులకు ఈ ‘డిక్టేటర్’ మరో కొత్త వెండితెర వడ్డింపు.

కథేమిటంటే, అనగనగా ఒక మినిస్టర్‌గారి కొడుకు. అతగాడు, అతని రౌడీ ఫ్రెండ్ డ్రగ్స్ దంధాలో ఉండగా, ఒక ఇన్‌స్పెక్టర్ (రవిప్ర కాశ్) పట్టుకోవాలని చూస్తాడు. సహజంగానే ఆ ఇన్‌స్పెక్టర్‌ని చంపేసి, ఆత్మహత్య అని లోకాన్ని నమ్మిస్తారు. తీరా ఆ హత్యను క్యాటరింగ్ ఉద్యోగి (రాజీవ్ కనకాల) చూస్తాడు. నటి అవ్వాలనుకొనే అతని చెల్లెల్ని (సోనాల్ చౌహాన్)ను విలన్లు వెంటాడి వేధిస్తారు. కిడ్నాప్ చేస్తారు. మాల్‌లో పనిచేస్తూ, అనుకోకుండా ఆమెకి దగ్గరైన చందు (బాలకృష్ణ) ఆమెను కాపాడి, ఏకంగా ఆ రౌడీ గ్యాంగ్ మనుషుల్ని చంపేస్తాడు. తమ వాళ్ళను చంపేసిన హీరో కోసం విలన్లు ఢిల్లీ, రాజస్థాన్‌ల నుంచి వస్తారు. అప్పటి దాకా కనిపించని బిజినెస్ మ్యాగ్నెట్ లైన హీరో అన్న (సుమన్) కూడా తమ్ముణ్ణి వెతుక్కుంటూ వస్తాడు.

సామాన్యుడిలా తిరుగుతున్న హీరో నిజానికి ‘డిక్టేటర్’గా పేరు పడ్డ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్య నేత చంద్రశేఖర్ ధర్మా అని అర్థ మవుతుంది. అక్కడికి ఇంటర్వెల్. సెకండాఫ్‌లో అతని పాత కథ ఫ్లాష్ బ్యాక్. అతను ప్రేమించి పెళ్ళాడిన మధ్యతరగతి అమ్మాయి కాత్యా యని (అంజలి) ఏమైంది, ఢిల్లీలో హీరోతో ఢీ అంటే ఢీ అన్న మహి మారాయ్ (రతీ అగ్నిహోత్రీ) కథేంటి, హీరో అయినవాళ్ళని వదిలేసి ఎందుకున్నాడు, చివరకు మళ్ళీ ఢిల్లీ వెళ్లి ఏం చేశాడన్నది సినిమా.

లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత చంద్రశేఖర్ ధర్మాగా బాలకృష్ణ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఫస్టాఫ్‌లో మాల్‌లో పనిచేసే మామూలు మనిషి చందుగా ఒదిగిపోవడానికి ప్రయత్నించారు. పాత్రపోషణలో తీవ్రత ఆయనకు అలవాటే. ఆహార్యం బాగుంది. శరీరంపై అదుపు, మాటల్లో పొదుపుతో ఇంకా బాగుంటారనిపిస్తుంది. సోనాల్ చౌహాన్ ‘వాట్సప్ బేబీ’ పాటకూ, కథ పురోగతికీ పనికొచ్చారు. సెకండాఫ్‌లో కాత్యా యనిగా తెలుగమ్మాయి అంజలి నటించారు, నాజూగ్గా ఉన్నారు.

అల్లుడు విశ్వంభర్‌తో కలసి ఢిల్లీలో చక్రం తిప్పే అత్తగారిగా నాటి హీరోయిన్ రతీ అగ్నిహోత్రీ తెలుగు తెరపై మెరిశారు. ఆమె, ఆమె అల్లుడి పాత్రలు చిన్నవైనా, అవి సమకాలీనమైనవేనని తెలుస్తుంది. ఫస్టాఫ్‌లో చెప్పడానికి తగినంత కథ లేకపోవడంతో, ఎక్కువగా కాలనీలో సీన్లు, కామెడీపై ఆధారపడ్డారు. వాటిలో ఎంత వినోదం పండిందో చటుక్కున చెప్పేయలేం. పట్టుగా సాగే ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్‌లోనే ఉన్న కొన్ని బలమైన సీన్లే వ్యవహారమంతా! ఇక సినిమాలో కావలసినన్ని ట్విస్టులు పెట్టారు. ఎక్కడికక్కడ కావాల్సినట్లుగా సినిమాను ముందుకూ నడిపారు. మినిస్టర్ కొడుకు హత్య చేయడం చూసిన రాజీవ్ కనకాలను విలన్లు వెతకడంతో మొదలయ్యే ఈ సినిమాలో సెకండాఫ్ నుంచి కన్వీనియంట్‌గా అతను కనిపించడు. అతని చెల్లెలైన సోనాల్‌చౌహాన్‌ను హీరో రక్షించడం ఫస్టాఫ్‌లోనే అయిపోయాక కథలో ఆమెపనీ ఉండదు. కనిపించదు. కడుపులో కత్తిపోటుతో కోమాలోకి వెళ్ళిన అంజలి ఆఖరులో మళ్ళీ వస్తారు.

నిర్మాణ విలువలు, కెమేరా వర్‌‌క కనిపించే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లాంటి చోట్ల, కొన్ని స్టెప్పుల్లో బాలకృష్ణ శ్రమా తెలుస్తుంది. ‘గం గణేశా’ పాట చిత్రీకరణ, గణపతిని గుర్తుచేసే స్టెప్పులు బాగున్నాయి. ‘నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో. నా బ్లడ్‌కే హిస్టరీ ఉంది’లాంటి బాలయ్య మార్‌‌క పంచ్ డైలాగ్స్ సీన్‌కు ఒకటికి రెండున్నాయి. ‘నాన్నగారి’ ప్రస్తా వనలు, ‘నాన్నగారి జ్ఞాపకాల జోలికొస్తే చంపేస్తా’లాంటి వార్నింగ్‌లూ పెట్టారు. హిందీ పంచ్ డైలాగ్ అదనం. ముమైత్‌ఖాన్, శ్రద్ధాదాస్‌లతో ఐటవ్‌ుసాంగూ పెట్టారు. వెరసి, కథ తెలిసిందే అయినా, ఢిల్లీ, బల్గేరియా లాంటి నేపథ్యాల్లో ఎంత కొత్తగా చెప్పారన్నదే ఆసక్తి. అందుకు లోపం లేకుండా ప్రయత్నించారు. ‘నేను సంపాదించేటప్పుడు లెక్కలు చూస్తాను కానీ, చంపేటప్పుడు లాజిక్‌లు చూడను’ అన్నది ఈ సినిమాలో వచ్చే హీరో డైలాగ్‌‌సలో ఒకటి. దాంతో ఈ ‘డిక్టేటర్’లో మనం చూడాల్సినదేమిటో, చూడకూడనిదేమిటో సుస్పష్టం. ఏతావతా భోగి నాటికే 3 కొత్త రిలీజ్‌లొచ్చినఈ సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎవరు ‘డిక్టేటర్’ అన్నది వేచి చూడాలి. ఎన్ని సినిమాలొచ్చినా, ఎంత స్టార్సున్నా ఆఖరికి టికెట్ కొనివెళ్ళిన ప్రేక్షకుడే వాటి బాగోగులు నిష్కర్షగా తేల్చే అసలైన డిక్టేటర్! ‘డిక్టేటర్’ సినిమా స్టైల్‌లో చెప్పాలంటే, ‘హీ ఈజ్ నాట్ రాంగ్!!’
 
 - రెంటాల జయదేవ