చనిపోతున్నానని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పిందా?

25 Apr, 2016 17:46 IST|Sakshi
చనిపోతున్నానని బాయ్‌ఫ్రెండ్‌కు చెప్పిందా?

న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ నటి, 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌ హీరోయిన్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ కేసులో  సోమవారం బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మృదుల భట్కర్‌ వాదనలు విన్నారు. చనిపోయేరోజున ప్రత్యూష తన ప్రియుడు రాహుల్‌ రాజ్‌ కు చేసిన చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌ను వినాలని న్యాయమూర్తి నిర్ణయించారు. చివరి ఫోన్‌కాల్ రికార్డింగ్‌లో పలు కీలకమైన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని ఈ ఫోన్‌కాల్‌లోనే ప్రత్యూష రాహుల్‌కు చెప్పిందని ఆమె లాయర్‌ చెప్తున్నారు.

మరోవైపు ఈ కేసును విచారిస్తున్న బాంగుర్‌ నగర్ పోలీసులు ఫోరెన్సిక్‌ నివేదికను అందుకున్నారు. ఈ నివేదికలో కీలక అంశాలు వెలుగుచూశాయి. చనిపోయేరోజున 24 ఏళ్ల ప్రత్యూష మద్యం మత్తులో ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. ప్రత్యూష చాలా అప్పులు చేసిందని, అప్పులవారి బాధ నుంచి తప్పించుకునేందుకు తరచూ మద్యం తాగేదని సన్నిహితులు చెప్తున్నారు. ప్రియుడు రాహుల్‌ రాజ్‌తోనూ తనకు సత్సంబంధాలు లేకపోవడం, తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె ఆత్మహత్యకు దారితీసినట్టు పోలీసులు భావిస్తున్నారు.  

తన ఆత్మహత్యకు ముందురోజు రాహుల్‌, ప్రత్యూష తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని, ఈ పార్టీకి వారి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని పోలీసుల విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా చనిపోయేరోజున మధ్యాహ్నం బాగా మద్యం తాగుతుండటంతో ప్రత్యూషను రాహుల్‌ తిట్టాడని, సాయంత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహుల్‌రాజ్‌కు బొంబాయి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యూష మృతి వ్యవహారంలో తాను అమాయకుడినని రాహుల్‌ చెప్తున్నాడు.