పెయింటింగ్‌... కుకింగ్‌.. డ్యాన్సింగ్‌

9 May, 2020 00:33 IST|Sakshi
దిగంగనా సూర్యవన్షీ

‘హిప్పీ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు హీరోయిన్‌  దిగంగనా సూర్యవన్షీ. ప్రస్తుతం గోపీచంద్‌ హీరోగా రూపొందుతోన్న ‘సీటీమార్‌’లో నటిస్తున్నారుఆమె. ఇంకా ‘వలయం’ అనే సినిమాతో పాటు వేరే భాషల్లో సినిమాలు కమిట్‌ అయ్యారు. జోరుగా షూటింగ్స్‌ చేస్తున్న తనకు అనుకోకుండా వచ్చిన ఈ లాక్‌డౌన్‌తో బ్రేకులు వేసినట్లయింది అంటున్నారామె. లాక్‌డౌన్‌ని ఎలా స్పెండ్‌ చేస్తున్నారో దిగంగనా చెబుతూ – ‘‘చదువుకునే రోజుల్లో పెయింటింగ్స్‌ వేసేదాన్ని. నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు పెయింటింగ్స్‌ వేయడానికి టైమ్‌ దొరకడంలేదు.

ఈ లాక్‌డౌన్‌ వల్ల నా పెయింటింగ్‌ స్కిల్స్‌కు మళ్లీ పదును పెడుతున్నాను. రాధాకృష్ణుల పెయింటింగ్‌ వేశాను. ఎక్కువగా టీవీ చూస్తే హోమ్‌ అరెస్ట్‌ అన్న ఫీలింగ్‌ వస్తుందేమోనని చూడడం లేదు. కానీ నేను చూడలేకపోయిన సినిమాలను ఈ సమయంలో చూస్తున్నాను. ఇంకా నాకు ఇష్టమైన వంటకాలను నేర్చుకున్నాను. పుస్తకాలు చదవడం, పాటలు పాడటం, డ్యాన్స్‌ చేయడం, ఆటలు ఆడటం (ఎయిర్‌ ఫుట్‌బాల్, బోర్డ్‌ గేమ్స్‌) వంటివి చేస్తున్నాను. నాన్న, నేను కలిసి డ్యాన్స్‌ చేస్తాం. బోర్డ్‌ గేమ్స్, ఎయిర్‌ ఫుట్‌బాల్‌ ఇలా అన్ని ఆటలు ఆడుకుంటాము.

ఇవన్నీ చేస్తూ మనం హ్యాపీగా ఉంటే ఈ ఖాళీ సమయంలో అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోం. అంతేకాకుండా లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ఒకేసారి ఎక్కువ పని చేయాలన్నా వెంటనే అలసిపోం. అందుకే ఖాళీ సమయంలో కూడా బిజీగా ఉంటున్నాను’’ అన్నారు.  ఇంకా దిగంగనా మాట్లాడుతూ – ‘‘షూటింగ్స్‌ ఉండటం వల్ల నా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకుంటున్నాను. రాజకీయాల నుంచి కుటుంబ విషయాల వరకు అన్నీ చర్చించుకుంటాం. చివరిగా ఒక మాట... ఇది వైరస్‌ (కరోనాను ఉద్దేశిస్తూ).. యుద్ధం కాదు. యుద్ధం అంటే సైనికులు ఉంటారు. కానీ ఈ వైరస్‌తో మనమే పోరాడాలి. మనమే జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు