-

అలా ఫిక్స్‌ అయితే బోల్తాపడతాం

1 Feb, 2019 02:20 IST|Sakshi
‘దిల్‌’ రాజు

 ‘‘స్క్రిప్ట్‌ స్టేజ్‌ నుంచి ప్రతిదీ ప్లాన్డ్‌గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్‌ వల్ల కావచ్చు.. మరోసారి కాస్టింగ్‌ కుదరక కూడా మిస్‌ఫైర్‌ అవ్వొచ్చు.. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా కారణా లుంటాయి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. ఇటీవల ‘ఎఫ్‌ 2’ సినిమాతో గ్రాండ్‌ సక్సెస్‌ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.

► 2017 ఎంత సక్సెస్‌ఫుల్‌గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్‌ ఇస్తుందనిపించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్‌ 2’తో ఇంత పెద్ద సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో 2021లో ‘ఎఫ్‌ 3’ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. దాదాపు సేమ్‌ టీమ్‌ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురు హీరోలు ఉంటారు.
     
► 2017లో 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, అలా జరిగిపోయింది. అలాగని 2019లో కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే బోల్తా పడే చాన్స్‌ ఉంది. కాబట్టి దాని గురించి అంత కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్‌ అయితే చాన్సెస్‌ ఉన్నాయి.
     
► తమిళ ‘96’ సినిమాని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాం. నా కెరీర్‌లో తొలి రీమేక్‌ ఇది. ఈ సినిమా గురించి మీడియాలో చాలా ఫేక్‌ న్యూస్‌లు బయటికి వచ్చాయి. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన ప్రేమ్‌ కుమార్‌ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు. హీరోగా శర్వానంద్‌ కరెక్ట్‌ అనీ, హీరోయిన్‌గా సమంత అయితే బాగుంటుందని, వాళ్లే కావాలని ప్రేమ్‌ అన్నారు.
   
 ► ‘96’ చక్కటి ఫీల్‌ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్‌ ఫీల్‌ని దర్శకుడు ట్రావెల్‌ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఈ సినిమాను తెలుగులో కూడా నువ్వే చేయాలని డైరెక్టర్‌తో చెప్పాను. ‘96’ తమిళంలో క్లాసిక్‌ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కచ్చితంగా హిట్‌ అవుతుందని నేను నమ్ముతున్నాను.
     
► మహేశ్‌బాబుతో చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్‌ 25న రిలీజ్‌ చేస్తాం. అమెరికా షెడ్యూల్‌ అప్పుడు వీసా ఆలస్యం కావడంతో సినిమా విడుదలను 5 నుంచి 25కు మార్చడం జరిగింది. నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్‌ కూడా ఆల్మోస్ట్‌ అయిపోయింది. షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ‘పలుకే బంగారమాయెనా’ అనే ప్రాజెక్ట్‌ కూడా ఉంది. ఈ చిత్రం విడుదలను 2020 సంక్రాంతికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇవి కాకుండా గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ సినిమా ఉంది. కానీ ముందు అనుకున్న కథతో ఈ సినిమా చేయడం లేదు.

మరిన్ని వార్తలు