టికెట్‌ రేట్ల పెంపుకి ప్రభుత్వం కారణం కాదు

9 May, 2019 00:08 IST|Sakshi

– ‘దిల్‌’ రాజు

‘‘కొన్ని సినిమాలు చూసినప్పుడు ‘వావ్‌.. ఎంత మంచి సినిమా చేశారు.. ఎంత బాగా తీశారు’ అనిపిస్తుంది. ‘మహర్షి’ నా సినిమా కాకపోయినా, మా సంస్థ ఈ సినిమాతో అసోసియేట్‌ కాకపోయినా కూడా నేను అలాగే ఫీలయ్యేవాణ్ణి. ‘మహర్షి’ గ్రేట్‌ సినిమా అని అందరూ అంగీకరిస్తారు’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. మహేశ్‌బాబు, పూజా హెగ్డే జంటగా, ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై సి.అశ్వినీదత్, ‘దిల్‌’ రాజు, పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా నేడు  విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు పంచుకున్న విశేషాలు...

► మహేశ్‌గారి కెరీర్‌లోని టాప్‌ సినిమాల లిస్టులో ‘మహర్షి’  కూడా ఉంటుంది. ‘మహర్షి’ ప్రీ రిలీజ్‌ వేడుకలో నేను చెప్పినట్టు.. ‘ఈ సినిమా ఎంత సక్సెస్‌ కావాలని ఆశపడుతున్నారో అంతే కోరుకోండి’ అని అభిమానులకు చెప్పాను. అది అతి నమ్మకంతో చెప్పలేదు. ఈ సినిమాతో నా ప్రయాణం, కథ, ప్రీ రిలీజ్‌కి ముందే సినిమా చూడటంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పాను.  

► అశ్వినీ దత్‌గారి పేరు కూడా ఈ సినిమాతో అసోసియేట్‌ అయి ఉంది. మే 9న ఆయన సంస్థలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి’ సినిమాలు విడుదలై హిట్‌ అయ్యాయి. పీవీపీగారు కూడా ప్యాషన్‌తో ఈ సినిమాతో అసోసియేట్‌ అయ్యారు. ఈ సినిమాతో వంశీ టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా ఉంటాడు. మ్యాజిక్‌ క్రియేట్‌ చేసే సినిమా ఇది. ఈ మాట కూడా అతి నమ్మకంతో అనడం లేదు.

► భారీ బడ్జెట్‌తో చేసిన సినిమా కావడం వల్ల పెద్ద ఎత్తున రిలీజ్‌ చేస్తున్నాం. ఐదో షో కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ జీఓ వల్ల 8 గంటలకే షోలు పడతాయి. మామూలుగా తెలంగాణలో 8 గంటల షోల ట్రెండ్‌ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 5 గంటలకే షోలు స్టార్ట్‌ అవుతాయి. మేం అనుమతి ఇస్తే వాళ్లు అర్ధరాత్రి ఒంటి గంటకు కూడా షోలు మొదలుపెడతారు.

► తెలంగాణ ప్రభుత్వం కాకుండా, థియేటర్ల ఓనర్లే కోర్టు ద్వారా టికెట్‌ రేట్ల పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అలాగే ఆంధ్రాలోనూ పెరిగాయి. తెలంగాణలో రూ.80 టికెట్‌ రూ.100 చేశారు. రూ.100ది రూ.125 చేశారు. మల్టీప్లెక్స్‌ల వారు రూ.150 ఉన్న చోట రూ.200 చేశారు. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వైజాగ్, కర్నూలు... ఇలా అక్కడ రూ. 200 ఉంది. మల్టీప్లెక్స్‌లలో బెంగుళూరులో వీకెండ్‌లో రూ.300–500 ఇచ్చేంత ప్రొవిజన్‌ ఉంది. తెలంగాణలో అది లేదు. తెలుగు స్టేట్స్‌లో లిమిటేషన్‌ ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచిందని కొన్ని మీడియాల్లో తప్పుడు వార్తలు రాశారు.

► ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనప్పుడు రేట్లను పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో అది ఇది వరకు లేదు. పక్క రాష్ట్రాల వారితో కంపేర్‌ చేసినప్పుడు ఇక్కడ కనీసం పెరగాలి కదా అని థియేటర్ల వాళ్లు వెళ్లి టిక్కెట్ల పెంపునకు అనుమతి తెచ్చుకున్నారు.

► ఒకప్పుడు సక్సెస్‌ఫుల్‌ సినిమా జర్నీకి జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అవి 100 రోజులయ్యాయి. ఇప్పుడు ‘బాహుబలి’ లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. ఒక గ్రేట్‌ సినిమా వచ్చినా రెవెన్యూ అనేది మేజర్‌గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. ఆ వీకెండ్స్‌ ఉన్న రెవెన్యూ మెయిన్‌గా సాగుతోంది. ఇప్పుడు అందరూ సినిమాను ఫాస్ట్‌గా చూడాలనేది ఒకటి, రెండోది పైరసీ వల్ల డ్యామేజ్‌ ఎక్కువగా జరుగుతోంది. ఎంత కంట్రోల్‌ చేసినా పైరసీ వస్తూనే ఉంది. అలాంటప్పుడు పెద్ద సినిమాల టార్గెట్‌ రీచ్‌ కావాలంటే టికెట్‌ ధరల పెంపు తప్పదు.

► నేను ఖర్చు పెట్టింది, వచ్చింది... ఇలాంటి నిజాలు ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియకుండా, ఎవరికి కావాల్సినవి వాళ్లు రాసుకుంటున్నారు. నిజానిజాలు ఏంటన్నది నాకు తెలుసు. నా పార్టనర్లకు తెలుసు. ఈ సినిమా బడ్జెట్‌ ఎంత అనేదాని మీద చాలా విషయాలు ఉంటాయి.  లాంగ్‌ ప్రాజెక్టులకు డ్యామేజ్‌లు పడతాయి. వడ్డీలు కావొచ్చు, అనుకోని అంశాలు కావొచ్చు... వాటన్నింటినీ బడ్జెట్‌లోకి తీసుకోలేం.

► ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్‌లున్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో ఎక్స్‌ట్రార్డినరీ పుల్లింగ్‌ ఉంది కాబట్టి, ఒక థియేటర్‌ ఫుల్‌ అయితే, పక్క థియేటర్‌ వాళ్లను అడిగినా సినిమా వేస్తారు. ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా ‘మహర్షి’. రెవెన్యూ ఎంత వస్తుందనేది చూడాలి.

మరిన్ని వార్తలు