రికార్డు ధరకు బాహుబలి హక్కుల్ని దక్కించుకున్న దిల్ రాజు

4 Jul, 2014 20:10 IST|Sakshi
రికార్డు ధరకు బాహుబలి హక్కుల్ని దక్కించుకున్న దిల్ రాజు
టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి-1' చిత్రం అనేక సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అరుదైన రికార్డును బహుబలి చిత్రం సొంతం చేసుకుంది. బాహుబలి పంపిణీ హక్కులను నైజాంతోపాటు ఇతర ఏరియాలను అత్యధిక రేటుకు సొంతం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. కేవలం నైజాం హక్కుల్ని భారీ స్థాయిలో సుమారు 25 కోట్ల రూపాయలు చెల్లించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'బహుబలి' ఒకటవ భాగాన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 
 
ఓ ప్రాంత హక్కుల కోసం టాలీవుడ్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో చెల్లించడం ఇదే మొదటిసారి. బహుబలి హక్కుల్ని సొంతం చేసుకున్న దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ ఊహించని విధంగా తెరకెక్కుతున్న బహుబలి చిత్ర విజయంపై దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారట. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు నటిస్తున్న 'బాహుబలి-1' 2015లో విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.