స్ట్రయిట్‌ సినిమా చేయడం ఈజీ

4 Feb, 2020 00:23 IST|Sakshi
దిల్‌ రాజు

శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో విజయవంతమైన ‘96’ చిత్రానికి రీమేక్‌ ఇది. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌  నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు విలేకరులతో మాట్లాడారు.

► నేను నిర్మాతగా చేసిన మొదటి సినిమా నుండి స్క్రిప్ట్‌తో పాటు ట్రావెల్‌ చేయటం అలవాటు. అందుకే రీమేక్‌ చిత్రాలు తీయలేదు. అది మాత్రమే కాదు స్ట్రయిట్‌ సినిమా చేయటం ఈజీ. మధ్యలో ‘ప్రేమమ్‌’, ‘బెంగుళూర్‌ డేస్‌’ సినిమాలు చూసినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను. ‘బెంగుళూర్‌ డేస్‌’ సినిమాకి చాలా వర్కవుట్‌ చేసి హీరోలుగా నాని, శర్వానంద్‌లను అనుకున్నాను. తర్వాత మూడో హీరో విషయంలో శాటిస్‌ఫై అవ్వలేదు. డ్రాప్‌ అయ్యాను. ‘ప్రేమమ్‌’ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నాగవంశీ ‘అన్నా.. ఈ సినిమాని నేను రీమేక్‌ చేస్తాను’ అన్నాడు. ‘సరే’ అన్నాను.

► అనుకోకుండా ఈ ఏడాది మూడు రీమేక్‌ సినిమాలు చేస్తున్నాను. ‘96’ తమిళ చిత్రాన్ని ‘జాను’ పేరుతో చేశాను. నాని హీరోగా తెలుగులో విజయం సాధించిన ‘జెర్సీ’ చిత్రాన్ని షాహిద్‌ కపూర్‌తో హిందీలో రీమేక్‌ చేస్తున్నా. బాలీవుడ్‌లో నిర్మాతగా నాకిది ఫస్ట్‌ సినిమా. అలాగే హిందీ ‘పింక్‌’ను తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమాను మే 15న రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం.

► ‘జాను’ సినిమా విషయానికొస్తే ‘96’ సినిమా ట్రైలర్‌ చూడగానే ఆసక్తిగా అనిపించింది. అప్పటినుండి దాన్ని ఫాలో అవుతూ వచ్చాను. నాకు తమిళ్‌ పెద్దగా అర్థం కాకపోయినా సినిమా టచ్‌ చేసింది. ఈ సినిమాలో అద్భుతమైన సన్నివేశాలతో పాటు చిన్నప్పటి ఫ్రెండ్స్, రీయూనియన్‌ అనగానే పాత రోజు లకు వెళ్లిపోతాం. జనరల్‌గా పదో తరగతి ప్రేమలు సక్సెస్‌ కావు. ఈ సినిమాలోనూ అంతే. ఈ పాయింట్‌ లె లుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.

► అల్లు అర్జున్‌తో మేం చేసిన ‘ఆర్య’ సినిమాకి ఈ చిత్రదర్శకుడు ప్రేమ్‌కుమార్‌ అసిస్టెంట్‌ కెమెరామేన్‌గా చేశాడట. మాకు గుర్తు లేదు. ‘96’ చూడ్డానికి కెమెరామేన్‌ విజయ్‌ చక్రవర్తితో వెళ్లినప్పుడు తను ఆ విషయం నాకు చెప్పాడు. మీకు ఆసక్తి ఉంటే తెలుగులో కూడా మీరే డైరెక్ట్‌ చెయ్యండని ప్రేమ్‌తో అంటే, సరే అన్నారు. తెలుగు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కథలో చిన్న మార్పులు చేశాం.

► నేను ఈ సినిమా చూస్తున్నప్పుడే త్రిష ప్లేస్‌లో సమంతను ఊహించుకున్నాను. ముందు సమంత  ఈ సినిమాలో నటించటానికి భయపడింది. షూటింగ్‌ స్టార్ట్‌ అయిన రెండు రోజుల తర్వాత ప్రతి రోజూ మేజిక్‌ జరుగుతోంది,  మీరు నన్ను ఒప్పించకుంటే మంచి సినిమా  మిస్‌ అయ్యేదాన్ని అని మెసేజ్‌ పెట్టింది.

► విజయ్‌ సేతుపతి ‘96’లో అద్భుతంగా నటించాడు. అతనిలాంటి హీరో దొరుకుతాడా అనుకున్నాను కానీ, ఈ కథను ఓన్‌ చేసుకొని శర్వానంద్‌ అద్భుతంగా బ్యాలెన్స్‌ చేశాడని ప్రేమ్‌కుమార్‌ అన్నాడు.
     మా బేనర్‌లో నెక్ట్స్‌ మహేశ్‌బాబు హీరోగా సినిమా ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు