‘నేను బతికే ఉన్నాను.. బాగున్నాను’

18 Nov, 2019 16:41 IST|Sakshi

తన ఆరోగ్యం గురించి వస్తున్న రూమర్లపై అలనాటి బాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ కపాడియా(62) స్పందించారు. ‘నేనింకా బతికే ఉన్నాను. బాగున్నాను. దయచేసి ఇష్టం వచ్చినట్లు ఊహించుకోకండి’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత నకిలీ వార్తలు జోరుగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డింపుల్‌ పెద్ద కుమార్తె, నటి-రచయిత్రి ట్వింకిల్‌ ఖన్నా ముంబైలోని ఆస్పత్రి బయట కనిపించడంతో.. డింపుల్‌ అనారోగ్యం బారిన పడ్డారంటూ వదంతులు వ్యాపించాయి. ఆస్పత్రి వద్ద నిల్చుని ఉన్న ట్వింకిల్‌ ఫొటోలు చూసి ప్రతీ ఒక్కరు తమకు ఇష్టారీతిన డింపుల్‌ ఆరోగ్యంపై కథనాలు అల్లేశారు.

ఈ నేపథ్యంలో ముంబైలో విలేకరులతో మాట్లాడిన డింపుల్‌.. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన తల్లి బెట్టీ కపాడియా అనారోగ్యం పాలయ్యారని, ఆమె కోసమే ఆస్పత్రికి వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నారని.. ఆమెకు దీర్ఘాయిష్షు ప్రసాదించేలా దేవుడిని కోరుకోవాలంటూ అభిమానులకు విఙ్ఞప్తి చేశారు. కాగా పదహారేళ్ల వయస్సులోనే బాబీ(1973) సినిమాతో డింపుల్‌ కపాడియా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. అదే ఏడాది సహ నటుడు, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రాజేశ్‌ ఖన్నాను వివాహమాడారు. ఈ జంటకు ట్వింకిల్‌ ఖన్నా(హీరో అక్షయ్‌ కుమార్‌ భార్య), రింకీ ఖన్నా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక సాగర్‌, రామ్‌ లఖణ్‌, దిల్‌ చాహ్‌తా హై, ద్రిష్టి, రుడాలి, ఫైండింగ్‌ నానీ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన డింపుల్‌... రుడాలి సినిమాకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. కాగా డింపుల్‌ కపాడియా ప్రస్తుతం టెనెట్‌ అనే హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా