సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు

5 Jan, 2020 01:23 IST|Sakshi
ఏఆర్‌ మురుగదాస్‌

‘‘రజనీకాంత్‌గారితో సినిమా చేయాలని 15 ఏళ్లగా అనుకుంటున్నా. కానీ కుదర్లేదు. ఫైనల్‌గా ఆయనతో సినిమాకి కాల్‌ వచ్చింది. ఆ న్యూస్‌ బయటకు వచ్చేసింది. నా మిత్రులందరూ ఫోన్‌ చేసి అభినందించారు. ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదు. తుది నరేషన్‌లోనూ సినిమా కుదరకపోవచ్చు. అలా జరగకూడదనుకున్నాను. అందుకే ఏ మార్పు సూచించినా నాలుగైదు ఆపషన్స్‌ ఉండేట్టు కథ తయారు చేసుకుని రజనీసార్‌ దగ్గరకు వెళ్లాను’’ అని దర్శకుడు మురుగదాస్‌ అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్బార్‌’. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్‌ తెలుగులో ఈ నెల 9న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా మురుగదాస్‌ మీడియాతో మాట్లాడారు.  

► చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో మా స్వగ్రామం. అక్కడ కేవలం 2 థియేటర్స్‌ ఉండేవి. చిన్నప్పుడు అమ్మతో కలసి రజనీగారి సినిమా చూశాను. రజనీగారిది ఈ ఊరే. థియేటర్‌లో ఉంటారు అనుకునేవాణ్ణి. ఓసారి అక్క వాళ్ల ఇంటికి వెళ్తే  ఆ ఊరి థియేటర్‌లోనూ ఉన్నారు. రజనీగారిది మన ఊరు కదా ఇక్కడికి ఎలా వచ్చారు అని నాకు డౌట్‌ వచ్చింది. అది సినిమా, ఆయన నటుడు అని వివరించి చెప్పారు మా అక్క. నా 5వ తరగతిలో చెన్నై టూర్‌ వెళ్లాను. చెన్నైలో రజనీసార్‌ ఎక్కడ అని చూస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత  అసిస్టెంట్‌ దర్శకుడిగా ఉన్నప్పుడు రజనీగారిని దూరంగా చూశాను. ‘గజిని’ అప్పుడు డైరెక్ట్‌గా కలిసే అవకాశం వచ్చింది.  

► తమిళ ‘గజిని’ రిలీజ్‌ అయ్యాక రజనీగారు ఫోన్‌ చేశారు. తమిళంలో మంచి సినిమా రిలీజ్‌ అయితే అభినందించడం ఆయనకు అలవాటు. ఆ టీమ్‌తో సంభాషిస్తారు. ‘గజని’ అప్పుడు నాకు ఆ అవకాçశం కలిగింది. ఆయన ‘శివాజీ’ చేస్తున్న సమయంలో మేం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు ‘గజిని’ హిందీ రీమేక్‌తో నేను, ‘రోబో’తో ఆయన బిజీగా ఉన్నాం. ఏడాదిన్నర క్రితం మళ్లీ సినిమా చేయాలనుకున్నాం. ఈసారి అవకాశం మిస్‌ అవ్వకూడదు అనుకున్నాను.  

► రజనీకాంత్‌ గారిని నేను ఎలా చూడాలనుకుంటున్నానో, ఆయన్ను స్క్రీన్‌ మీద చూసి ఎలా ఎంజాయ్‌ చేశానో అది ఈ జనరేషన్‌ వాళ్లకు కూడా కనెక్ట్‌ అయ్యేలా ‘దర్బార్‌’లో చూపించాను. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పోలీస్‌ కథ ఇది. సమాజంలో జరిగే అన్యాయాలకు తనదైన శైలిలో న్యాయం చేసే పోలీస్‌ కథ. ఇందులో ఫ్యాన్స్‌ ఆయన్నుంచి ఆశించే మేనరిజమ్స్, స్టయిల్స్‌ అన్నీ ఉంటాయి.  రజనీగారితో ఈ ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి ఆయన చాలా విషయాలు చెప్పారు. నాకో పుస్తకం కూడా ఇచ్చారు.

► సినిమా అనేది చాలా పవర్‌ఫుల్‌ మీడియా. సినిమా కేవలం వినోదంగానే  ఉండకూడదని నా అభిప్రాయం. అందుకే సందేశం ఇవ్వాలనుకుంటాను. ఆ సందేశం వల్ల ఒక్క రాత్రిలో జనాలు మారిపోతారని కాదు.  కానీ ఓ ఆలోచన కలుగుతుంది. మెల్లిగా తెలుసుకుంటారు. కమర్షియల్‌ సినిమాలో, పెద్ద హీరోల సినిమాల్లో సందేశం జోడిస్తే ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది.  

► రజనీకాంత్‌గారు మేకప్‌ వేసుకొని కేరవేన్‌ నుంచి బయటకు వచ్చాక మళ్లీ లంచ్‌ బ్రేక్, షూటింగ్‌ ప్యాకప్‌ అప్పుడే లోపలికి వెళ్తారు. షూటింగ్‌ లేట్‌ అయినా సహకరిస్తారు.

► మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీలో ఒక సూపర్‌ స్టార్‌గా ఎదిగిన అమ్మాయి నయనతార. ఆమె ఎదుగుదలను మనం గౌరవించాలి. చాలా గ్యాప్‌ తర్వాత నయనతార, రజనీసార్‌ కలసి యాక్ట్‌ చేశారు. అనిరుధ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగా ఇచ్చాడు. ఎన్వీ ప్రసాద్‌గారితో ఎప్పటి నుంచో నాకు పరిచయం ఉంది. ఆయన నిర్మాతలా కాకుండా ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటారు. నా తదుపరి చిత్రం గురించి నిర్ణయించుకోలేదు. ‘తుపాకీ’ సీక్వెల్‌ ఆలోచన ఉంది.

► ఈ సినిమాలో హీరో పాత్రకు ఓ పవర్‌ఫుల్‌ పేరు పెట్టాలి. ఏం పెట్టాలా అని ఆలోచించాను. షూటింగ్‌లో ఆలోచిద్దామనుకున్నా. హీరో వేసుకునే పోలీస్‌ యూనిఫామ్‌ మీద నేమ్‌ప్లేట్‌ తయారు చేయాలని ముందే అడిగేసరికి మా నాన్న పేరు (అరుణాచలం) మా అబ్బాయి (ఆదిత్య) పేర్లు కలిపి ఆదిత్యాఅరుణాచలం అని పెట్టా. 
 
► ప్రస్తుతం కొత్త కొత్త దర్శకులు కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు తీస్తున్నారు. నా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ కూడా డైరెక్టర్స్‌ అవుతున్నారు. నేను ఇచ్చిన కథతో శరవణన్‌ అనే అతను ‘రాంగీ’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిక.  
     
► తెలుగులో స్ట్రయిట్‌గా నేను తీసిన సినిమాలు సరిగ్గా ఆడలేదు. స్టార్‌డమ్‌ను అంచనా వేయడంలోనో ఇంకేదో విషయంలోనో మిస్‌ అయ్యాను. మహేశ్‌బాబు లాంటి సూపర్‌స్టార్, కష్టపడే హీరోకు హిట్‌ ఇవ్వలేదని బాధపడ్డాను. సినిమా రిలీజ్‌ అయిన 10 రోజుల తర్వాత కూడా నన్ను ప్రోత్సహించేలా మెసేజ్‌లు పంపారు మహేశ్‌గారు. ఆయన చర్మం రంగు కంటే ఆయన మనసు ఇంకా తెలుపు. సినిమాను ఇంతలా ప్రేమించే హీరోకు హిట్‌ ఇవ్వలేకపోయాననే బాధ ఎప్పటికీ ఉంటుంది. 

మరిన్ని వార్తలు