వసుధైక స్ఫూర్తితో...

31 May, 2016 08:38 IST|Sakshi

‘కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి..’ మాజీ రాష్ర్టపతి, శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ కలామ్ యువతకు చేసిన సూచన. బాల అనే యువకుడు ఆ మహానుభావుడు చెప్పినట్టే సాధించాడు. సినిమా అంటే అతడికో ఆసక్తి.. దర్శకుడు కావాలన్నది కోరిక. ఎంతలా అంటే.. డిగ్రీ అయిపోగానే ఇంటిని వదిలేసి హైదరాబాద్ వెళ్లగలిగినంత..! స్నేహితుల గదుల్లో ఉంటూ సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ గడిపాడు. సీరియళ్లతో అదృష్టం పరీక్షించుకున్నాడు.

నిరూపించుకున్నాక తన కలను నిజం చేసుకునే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. తన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో తీసిన ‘వసుధైక 1957’ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య పంచుకోవాలని భావించిన బాల సోమవారం వారితో కలిసి తెనాలి వచ్చారు. స్థానిక థియేటర్‌లో ఆ సినిమాను కలిసి తిలకించాడు. అనంతరం ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
 
వీవీ వినాయక్‌పై అభిమానంతో..
కొల్లిపర మండలం తూములూరు మా ఊరు. తండ్రి జోజప్ప వ్యవసాయం. తల్లి మేరీ గృహిణి. అందరిలోకి చిన్నవాడిని. సినిమాలంటే చాలా చాలా ఇష్టం. ఇంటర్ చదివేటప్పుడే సినిమా దర్శకుడ్ని కావాలనుకున్నా. చదువుతోపాటు ఆ కోరిక పెరిగి డ్రీమ్‌లా మారిపోయింది. వీవీ వినాయక్ తీసిన ‘ఆది’ సినిమాతో ఆయన అభిమానినయ్యా. ఆయనలా దర్శకుడిని కావాలని ఫిక్సయ్యా. ఇంట్లో మాత్రం నేను చదువుకుని ఉద్యోగం చేయాలని ఆశపడ్డారు. తెనాలిలో డిగ్రీ పూర్తిచేయగానే నేరుగా హైదరాబాద్ వెళ్లా. అక్కడ స్నేహితులతో గడుపుతూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా.
 
ఏడాది తర్వాత ఫలితం

ఏడాది కష్టపడ్డాక ఫలితం దక్కింది. ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ ‘మనసు చూడతరమా’ టీవీ సీరియల్‌కు దర్శకత్వ విభాగంలో అప్రెంటిస్‌గా కుదిరాను. మరో చానల్‌లో ‘అంతఃపురం’ సీరియల్‌కు సహదర్శకుడిగా వ్యవహరించాను. అలాగే, కొన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చాను. ఖాళీ సమయాల్లో నా ఆలోచనలతో సినిమా కథలు రాస్తూ, వాటికి స్క్రీన్‌ప్లే రూపొందిస్తుంటా. స్నేహితుడి ద్వారా నిడమలూరు శ్రీనివాసరావు పరిచయమయ్యారు. ఆయన నిర్మాతగా సినిమా తీయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. నేను కలిసి కథ చెప్పగానే ఇంప్రెస్సయ్యారు. వసుధైక 1957 సినిమాతో ఇలా మీముందున్నా.
 
సంతోషంగా ఉంది
నేను దర్శకత్వం వహించిన సినిమా నా ఊళ్లో ఆత్మీయుల సమక్షంలో తిలకించడం ఆనందంగా ఉంది. ఒకప్పుడు నన్ను పట్టించుకోని మా ఊరివాళ్లు, ఇప్పుడు పరిశీలనగా చూస్తున్నారు. నేను సాధించానన్న భావన వారి కళ్లలో నాకు కనిపించింది. అదే నాకు సంతోషాన్ని ఇచ్చింది. దీన్ని కలకాలం నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను. ప్రేక్షకులు మెచ్చే సినిమాలతో మంచి దర్శకుడిగా సినీ పరిశ్రమలో గుర్తింపు పొందాలనేది నా కోరిక.
 
అది యదార్థ గాథ
వసుధైక 1957 సినిమాలో బ్రహ్మాజీ, సత్యం రాజేష్, రఘు, షాణి, సుభాష్, శ్రీలత కారుణి, పావని, బేబి యోధ నటించారు. 1957లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఐదేళ్ల పాప జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రాసుకున్న కథ ఇది. ప్రేమకథతో తీస్తే పాపులారిటీ వస్తుంది. లో బడ్జెట్ సినిమా అయినందున తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతను హార్రర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చా. వసుధైక కుటుంబం అనే మాటలోంచి టైటిల్‌ను తీసుకున్నా. పాజిటివ్ టాక్ వచ్చింది. టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నా రెండో చిత్రం ప్రేమకథా చిత్రమే. త్వరలోనే ప్రకటిస్తా.