అందరూ డిఫరెంట్ అంటారు...నేను న్యాచురల్ అంటాను!

20 Jul, 2016 08:26 IST|Sakshi
అందరూ డిఫరెంట్ అంటారు...నేను న్యాచురల్ అంటాను!

‘‘డిఫరెంట్ సినిమాలు తీయాలని ప్రయత్నించిన మాత్రాన డిఫరెంట్ కథలు, ఆలోచనలు రావు. అందరూ నా సినిమాలను డిఫరెంట్ అంటున్నారు కానీ.. నాకు మాత్రం న్యాచురల్‌గానే అనిపిస్తాయి. నా ఆలోచనలు అంతే’’ అని దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి అన్నారు. ఆయనదర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మనమంతా’ ఆగస్టు 5న విడుదల కానుంది. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన విశేషాలు...
 
‘సాహసం’ ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆ చిత్రం విడుదల తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా తీయాలనుకున్నాను. కథ రాయడానికి కొంచం ఎక్కువ సమయమే పట్టింది. గతేడాది డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేశాం. కథ రాసిన తర్వాతే ఆర్టిస్టులను ఎంపిక చేస్తాను. మోహన్‌లాల్, గౌతమి అయితే ఈ కథకు న్యాయం చేస్తారని భావించాను. నా ఫస్ట్ చాయిస్ వాళ్లే. నేను ఫస్ట్ చాయిస్ ఎవర్ని అనుకున్నానో లక్కీగా వాళ్లందరికీ కథ నచ్చింది. ఇలాంటి కథలు అంగీకరించాలంటే నిర్మాతకు మంచి అభిరుచి ఉండాలి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో సాయి కొర్రపాటిగారు కథ వినగానే నిర్మించడానికి అంగీకరించారు.
 
♦  ప్రతిరోజూ మనమంతా పలు సంఘటనలను చూస్తాం. వాటిని చూసిన తర్వాత ఓ స్కూల్ పాప ఎలా స్పందిస్తుంది? ఓ కాలేజీ స్టూడెంట్, ఓ హౌస్‌వైఫ్, ఓ మిడిల్ ఏజ్డ్ పర్సన్.. వివిధ సంఘటనల పట్ల వీరంతా ఎలా స్పందిస్తారనేది ‘మనమంతా’. ఈ నాలుగు కథలూ క్లైమాక్స్‌లో కలుస్తాయి. అప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కథేంటో చెప్తే ప్రేక్షకులకు కిక్ ఉండదు.  
 
♦  ఇప్పటివరకూ నేను తీసిన సినిమాల్లో బాగా కష్టపడిన సినిమా ఇది. ఓ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఆ మూడ్‌లోకి వెళతాం. నాలుగు కథలు కావడంతో స్క్రీన్‌ప్లే రాయడం కష్టమైంది. యాక్షన్ లేదు, ఎక్కువ పాటలు లేవు, థ్రిల్లర్ కాదు, ఫ్యామిలీ డ్రామాలో స్క్రీన్‌ప్లే కొత్తగా ప్రయత్నించాను.
 
♦  యాక్టింగ్‌లో మోహన్‌లాల్‌గారు జీనియస్. ఈ రోజు కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదు. స్పాంటేనియస్ యాక్టర్. ఫస్ట్ టేక్‌లో నటించినట్టు, సెకండ్ టేక్‌లో నటించరు. ఆ పాత్రలా బిహేవ్ చేస్తారు. గౌతమిగారు, మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. తెలుగులో డబ్బింగ్ చెప్తానని మోహన్‌లాల్‌గారు పట్టుబట్టారు.
 
♦  ‘ప్రయాణం’ తర్వాత వెంకటేశ్‌గారితో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశా. కానీ, కుదరలేదు. ఆ కథకూ, ఈ ‘మనమంతా’ కథకూ ఎటువంటి సంబంధం లేదు.   
 
♦  ‘ఐతే’ తీసినప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ఇంతలేదు. మల్టీప్లెక్స్‌లు లేవు. ఇటీవల భిన్నమైన కథలతో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓవర్సీస్‌లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మూడు నాలుగేళ్ల తర్వాత ఈ ట్రెండ్ ఇంకా మారుతుంది.
 
♦  మంచి కథకు స్టార్ హీరో తోడయితే.. ఆ సినిమా ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతుంది. మలయాళంలో మోహన్‌లాల్‌గారు సూపర్‌స్టార్. ఆయన నటిస్తున్నప్పుడు మలయాళంలో తీయకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే ఈ చిత్రాన్ని మలయాళంలో తీశాం. తమిళంలో మాత్రం డబ్బింగ్ చేస్తున్నాం.