మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి

19 Feb, 2019 08:09 IST|Sakshi

తమిళసినిమా: మంచి చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు సెళియన్‌ అన్నారు. కల్లూరి, తెన్‌మేర్కు పరువక్కాట్రు, పరదేశి, జోకర్‌ వంటి మంచి చిత్రాలకు ఛాయాగ్రహణను అందించిన ఈయన తొలి సారిగా మోగాఫోన్‌ పట్టిన చిత్రం టులెట్‌. టైటిల్‌ చూస్తే సాధారణంగా ఉన్నా ఇప్పటివరకూ ఏ తమిళ సినిమాకు సాధ్యంకాని విధంగా 100కు పైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై, 32 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు ఇందుకుగానూ 80 సార్లు సబ్‌ టైటిల్స్‌ను మార్చారు. గతేడాది నవంబరు 17న తొలి సారిగా కోల్‌కతా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. ఆ తరువాత వరుసగా వందకు పైగా అంతర్జాతీయ చిత్రోత్సావాల్లో ప్రదర్శింపబడింది. అలాంటి చిత్రం ఈ నెల 21వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సెళియన్‌ మాట్లాడుతూ ఒక చిత్రం అంతర్జాతీయ అవార్డులు సాధిస్తే చాలా? వ్యాపార రీత్యా విజయం సాధించే అవకాశం ఉందా? చిత్ర విడుదలలో జాప్యానికి కారణం ఏంటీ? అనే పలు విషయాలను స్పష్టంగా వివరించారు.

అవేంటో చూ ద్దాం. చెన్నైలో ఐటీ శాఖ అభివృద్ధి చెందడంతో ఇక్కడ అద్దె ఇళ్లు లభించడం ఎంతో సమస్యగా మారింది. ప్రధానంగా మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అలా అద్దె ఇంటి కోసం వెతికే ఒక సగటు కుటుంబం సమస్యే టులెట్‌ చిత్ర కథ. ఇక చిత్ర విడుదలలో ఆలస్యం గురించి చెప్పాలంటే సాధారణంగా ఒక చిత్రాన్ని పూర్తి చేయడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవాల ప్రదర్శనలకు మరో ఏడాది పట్టింది. ఇప్పుడు సరైన సమయం కావడంతో చిత్ర విడుదలకు సిద్ధం అయ్యాం. మరో విషయం ఏంటంటే చిన్న బడ్జెట్‌ చిత్రాలు, అదీ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడ్డ చిత్రాలు అనగానే కొందరికి చులకన దృష్టి ఉంటుంది. మలయాళం, బెంగాలీ భాషల్లో చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకుంటే ఆ చిత్ర యూనిట్‌కు ఆ ప్రభుత్వాలు రూ.25 లక్షలు, రూ.40 లక్షలు, లేదా ఒక ఇల్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. టులెట్‌ లాంటివి ఏడాదికి 10 చిత్రాలు వస్తే మన రాష్ట్రం ప్రోత్సహిస్తుందేమో. ఇలాంటి చిత్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో తమిళ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంతో పాటు చిత్ర నిర్మాణానికి చేసిన ఖర్చు తిరిగి వస్తుంది. కొన్ని చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సాల్లో ప్రదర్శింపబడి అవార్డులు గెలుచుకోలేకపోయినా అవి మంచి చిత్రాలని భావించి అక్కడి ఛానళ్లు ప్రసార హక్కులను కొంత మొత్తానికి పొందుతాయి. అలా పలు దేశాలకు చెందిన వేలాది ఛానళ్లు ఉన్నాయి. వాటికి మొత్తంలో ఆదాయం వస్తుంది.  టులెట్‌ చిత్ర కథ గురించి ఒక నిర్మాత వద్ద చెప్పగా ప్రముఖ నటీనటులతో భారీ బడ్జెట్‌లో చేద్దాం అన్నారు. అయితే అది నాకు సమ్మతం అనిపించలేదు. ఇతరుల డబ్బుతో ప్రయోగం చేయడం ఇష్టం లేక నా భార్యనే నిర్మతగా రూపొందించాను. ప్రపంచం అంతా తిరిగి పలు అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం మన ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది అని దర్శకుడు సెళియన్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు