సీక్వెల్‌ మీద సీక్వెల్‌

11 Feb, 2018 00:54 IST|Sakshi
గౌతమ్‌ మీనన్‌

డీసీపీ రామ్‌చందర్‌ మళ్లీ వస్తే? రాఘవన్‌ మళ్లీ కనిపిస్తే? సత్యదేవ్‌ మళ్లీ సందడి చేస్తే ఎంత బాగుండు అని ఆ క్యారెక్టర్స్‌ని ఇష్టపడినవాళ్లు అనుకోవడం సహజం. ‘ఘర్షణ’లో వెంకటేశ్‌ చేసిన స్టైలిస్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ పేరు రామ్‌చందర్‌ అనీ, ‘రాఘవన్‌’లో కమల్‌హాసన్‌ పాత్ర పేరు రాఘవన్‌ అనీ, ‘ఎంతవాడు గానీ’లో అజిత్‌ పేరు సత్యదేవ్‌ అనీ గుర్తుండే ఉంటుంది. మంచి హిట్‌ సాధించిన ఈ చిత్రాలు, ఆ పాత్రలనూ మరచిపోలేం. అందుకే గౌతమ్‌ మీనన్‌ మళ్లీ ఈ క్యారెక్టర్స్‌ని కొనసాగించాలనుకుని ఉంటారు. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ‘ఘర్షణ’ తమిళ ‘కాక్క కాక్క’కు రీమేక్‌.

అందులో సూర్య హీరో. అలాగే కమల్‌ ‘వేటై్టయాడు విలైయాడు’ తెలుగులో ‘రాఘవన్‌’గా, అజిత్‌ ‘ఎన్నై అరిందాల్‌’ తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో అనువాదమయ్యాయి. తమిళంలో ఈ మూడు చిత్రాలకు సీక్వెల్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు గౌతమ్‌. ఇవి డబ్బింగ్‌ రూపంలోనో లేక తమిళ్‌తో పాటు తెలుగులో కూడా నిర్మిస్తే టాలీవుడ్‌ ప్రేక్షకులూ చూడొచ్చనుకోండి. ‘‘ముందు ‘ఎన్నై అరిందాల్‌’ సీక్వెల్‌ స్క్రిప్ట్‌ తయారు చేసి, అజిత్‌ను అప్రోచ్‌ అవుతాను’’ అన్నారు గౌతమ్‌. యాక్చువల్లీ ఈ మూడు హై వోల్టేజ్‌ పోలీస్‌ స్టోరీలు ఒక పోలీసాఫీసర్‌ లైఫ్‌లో వివిధ దశల్లో జరిగే కథలని, ఈ మూడు సినిమాలు ఒక ట్రయాలజీ అని, ఎన్నై అరిందాల్‌తో ఈ ట్రయాలజీ ముగుస్తుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్‌. మరి.. వీటి సీక్వెల్స్‌ ఎలా ప్లాన్‌ చేశారు? అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు