జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి : గుణశేఖర్‌

18 Nov, 2017 23:53 IST|Sakshi

తెలుగుభాషలెక్క ఆడవుంటా! ఈడవుంటా! అవార్డు యాడా!

రాజకీయ లబ్ధి కోసం కళాకారుల కష్టాన్ని పణంగా పెట్టొద్దు

‘‘జీవితారాజశేఖర్‌గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్‌.. తెలుగుదేశం రాకింగ్‌’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని  కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్‌ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై  తన అభిప్రాయాలను చెప్పారు.

వర్మగారిని నిందించడం తగదు
దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు.

దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్‌ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం.

నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్‌ శ్రీధర్‌గారు, దర్శకుడు  బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు.

నా వెనక శక్తులేం లేవు!
నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్‌ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్‌ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్‌ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్‌ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు.

నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్‌ 9న రిలీజ్‌. 7వ తేదీ సెన్సార్‌ సర్టిఫికెట్‌ వచ్చింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్‌ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్‌మెంట్‌ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు.

12న చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ కల్లంగారు ఇన్ఫర్మేషన్‌ డిపార్ట్‌మెంట్‌కి ఒక నోటీస్‌ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్‌ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్‌ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్‌ క్లోజ్‌ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్‌ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్‌ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్‌ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా.

అజయ్‌ కల్లంగారిచ్చిన నోటీస్‌ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్‌ రాలేదు. నేనే ఫోన్‌ చేస్తే, లిఫ్ట్‌ చేయలేదు. మెసేజ్‌ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్‌ మీటింగ్‌ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు.

ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్‌ లేదు.  దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్‌ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా.

ఆ నిబంధన తీసేయాలి
నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్‌ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది.

మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్‌? అని అప్‌కమింVŠ  డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు?

మెసేజ్‌ కనిపించలేదా?
‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్‌ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్‌ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్‌ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట.

అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్‌ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్‌ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్‌ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్‌ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు.

జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్‌ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్‌ విషయంలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్‌ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు.

మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్‌ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా?  ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్‌ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్‌ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్‌ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు.

‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్‌ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్‌సెట్‌ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు.

‘బాహుబలి’ బెటర్‌ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్‌ డామినేషన్‌. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి.

మరిన్ని వార్తలు