శ్రీదేవిలా తెరపై వెలుగుతారా?

21 Mar, 2018 04:47 IST|Sakshi

సాక్షి, చెన్నై: బయోపిక్‌ చిత్రాలు తెరకెక్కించడం అంత సులభం కాదు. ఎవరిని పడితే వారి బయోపిక్‌లను వెండితెరపై ఎక్కించనూలేరు. అందుకో అర్హత ఉండాలి. అందుకు తగ్గ చరిత్ర ఉండాలి. అలా మహానటి సావిత్రి జీవిత చరిత్ర నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య భారత క్రికెట్‌ కెప్టెన్‌ ఎంఎస్‌.ధోని జీవిత చరిత్రతో రూపొందిన చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతకు ముందు సంచలన శృంగారతార సిల్క్‌స్మిత్‌ బయోపిక్‌ ది దర్టీ పిక్చర్‌ పేరుతో తెరకెక్కింది. 

అందులో స్మిత పాత్రలో నటించిన నటి విద్యాబాలన్‌ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తాజాగా అతిలోకసుందరి శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాట పుట్టి, తమిళ చిత్రసీమలోకి బాలతారగా అడుగిడి, అటుపై తెలుగు, కన్నడం అంటూ పసివయసులోనే బహుభాషా బాలతారగా గుర్తింపు పొందిన నటి శ్రీదేవి. కథానాయకిగానూ భారతీయ సినీపుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు, ప్రఖ్యాతులను పొందిన శ్రీదేవి అన్ని భాషల్లోనూ 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 

ఇటీవల దుబాయ్‌లో మరణించిన శ్రీదేవిపై ఆయన భర్త బోనీకపూర్‌నే చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఆ విషయంలో క్లారిటీ లేకపోయినా, బెంగళూర్‌కు చెందిన అతిలోకసుందరి శ్రీదేవి అభిమానులు ఆమె బయోపిక్‌ని డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందిస్తున్నారు. తాజాగా హిందీ దర్శకుడు హన్సల్‌ మెహ్తా శ్రీదేవి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయం గురించి ఆయన తెలుపుతూ ఇంతకు ముందు శ్రీదేవిని తన చిత్రం లో నటింపజేయాలనుకున్నారు. 

ఇంతలోనే ఆమె అకస్మాత్తుగా మరణించడంతో తన కోరిక నెరవేరకుండా పోయిందని అన్నారు. అందుకే శ్రీదేవి జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి తమిళ చిత్రాల నుంచి హిందీ చిత్రాల్లో నటించే స్థాయికి ఎదిగారని, ఆమె జీవితంలో ఆర్థిక సమస్యలు, వైద్యుల శస్త్ర చికిత్స తప్పిదంతో తల్లి మరణం, ఆ ఆస్పత్రి నిర్వాకంపై కోర్టు కేసు వేయడం, దుబాయిలో మరణం వరకూ శ్రీ దేవి జీవిత అంశాలు ఈ చిత్రం లో చోటు చేసుకుంటాయని తెలిపారు. ఈ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటి విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని తెలిపారు. శ్రీదేవితో కలిసి నటించిన రజనీ కాంత్, కమల్, అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర, మిథున్‌చక్రవర్తి లాంటి పాత్రలు కూడా ఈ చిత్రంలో చోటు చేసుకుంటా యని, వారి ఎంపిక జరుగుతోందని చిత్ర దర్శకుడు హన్సల్‌మెహ్తా తెలిపారు. 

మరిన్ని వార్తలు