ముహూర్తబలం బాగుంది... అందుకే..!

17 Oct, 2015 23:16 IST|Sakshi
ముహూర్తబలం బాగుంది... అందుకే..!

క్రిష్... ఏం చేసినా ఇంట్రస్ట్‌తో చేస్తాడు, ఇన్‌డెప్త్‌తో చేస్తాడు. అందుకే, క్రిష్ సినిమాలకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఆయన చేసిన భారీ ప్రయత్నం ‘కంచె’ ఈ దసరాకు బాక్సాఫీస్ సరిహద్దులు చెరిపేస్తుందని భావిసు ్తన్నారు. ఈ 22న వస్తున్న ‘కంచె’ గురించి క్రిష్ చెప్పిన విశేషాలు...
 
 రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సినిమా అంటే... సాహసమే!
 గత వందేళ్ల చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం మార్చినంతగా మానవ జాతి గతిని మార్చింది ఇంకేదీ లేదు. పాతిక లక్షల మంది భారతీయులు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. మన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పక్కన ఉన్న ‘మిలటరీ మాధవరం’ అనే గ్రామం నుంచి రెండువేల మంది వెళ్లి, వరల్డ్ వార్ వన్‌లో, టూలో పోరాడారు. మనవాళ్లు పాతిక లక్షల మంది పోరాడిన ఆ యుద్ధ నేపథ్యంలో సినిమా ఎందుకు తీయకూడదని పించింది. భారతీయ తెరపై ఇప్పటివరకూ ఎవరూ చూపించని విషయాన్ని చూపించాలన్నది నా ఆశయం. చరిత్ర తీయడమంటే రిస్కే. కానీ, ఎవరూ ప్రయత్నించనిది చేస్తున్నప్పుడు తెలియని ఎనర్జీ ముందుకు డ్రైవ్ చేస్తుంది.
 
 ఇలాంటి ఓ బలమైన చరిత్రకు ఎస్టాబ్లిష్డ్ హీరోను ఎందుకు అనుకోలేదు?
 ఎస్టాబ్లిష్డ్ హీరో వల్ల నాకు ఒరిగేది బడ్జెట్ మాత్రమే. వరుణ్ తేజ్ వల్ల నాకు ఒరిగేది హానెస్టీ. వరుణ్ మొదటి సినిమా నేనే చేయాల్సింది. అప్పట్లో తనతో ట్రావెల్ చేసినప్పుడు తన కళ్లల్లో నిజాయతీ చూశాను. ఈ సినిమాకి అది కావాలి. దూపాటి హరిబాబు పాత్రకు నూటికి నూరుపాళ్ళు తనే యాప్ట్. ఒక సైనికుడి ప్రేమకథ ఇది. సైనికుడికి కావల్సిన దేహదారుఢ్యం వరుణ్‌కి ఉంది. 1940లో టీనేజ్‌లో ఉన్నవాళ్లు కూడా మ్యాన్లీగా కనిపించే వారు. వరుణ్‌లో ఆ మ్యాన్లీనెస్ ఉంది. 1936లో కాలేజీలో చదువుకునే కాలేజీ కుర్రాడిలా, 1944లో యుద్ధంలో పోరాడే కెప్టెన్‌గా కనిపిస్తాడు. సీతారామశాస్త్రిగారు ఇందులోని మూడు సీన్స్ చూసి, ‘వరుణ్‌ని ఈ సినిమా కోసమే నాగబాబు కన్నారా’ అన్నారంటే ఆలోచించండి.
 
 వరుణ్‌కి ఏమైనా శిక్షణ ఇప్పించారా?
 మాజీ ఆర్మీ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో బూట్ క్యాంప్ చేశాం. అంటే... ఒక సైనికుడి ప్రవర్తన ఎలా ఉండాలి? తుపాకీ ఎలా పట్టుకోవాలి? ఎలా షూట్ చేయాలి? అనే దాని మీద శిక్షణ ఉంటుంది. మామూలుగా ఆరు నెలలు బూట్ క్యాంప్ చేస్తారు. కానీ, సినిమాకి అన్ని నెలలు కుదరదు కదా. ఏడు రోజులు చేశాం. హరిబాబు ఈ సినిమాలో ‘ప్రియమైన సీతకు’ అని లెటర్ రాస్తూ ఉంటాడు. సైనికుడిగా కుటుంబానికి దూరంగా ఉంటాడని చెప్పక్కర్లేదు. బూట్ క్యాంప్ చేసిన ఆ ఏడు రోజులూ వరుణ్ ఫ్యామిలీ నిజంగానే హైదరాబాద్‌లో లేరు. ‘ఫ్యామిలీస్‌కి దూరంగా సైనికులు ఎలాంటి వేదన అనుభవించి ఉంటారో’ అనేవాడు. అందరూ ఈ పాత్ర చేయచ్చు, కానీ, వరుణ్ తప్ప ఎవరూ నప్పరని బలంగా చెబుతాను.
 
 అప్పటి వాతావరణాన్ని ఇప్పుడెలా? ఆయుధాలు, కాస్ట్యూమ్స్ సంగతి?
 గూగుల్‌లో రిఫరెన్స్ తీసుకుని చేశాం. ఆర్ట్ డెరైక్టర్ సురేశ్ వర్క్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ పనితనం ఆ వాతావరణాన్ని తెచ్చాయి. కొన్ని ఆయుధాలు మ్యూజియమ్స్‌లో దొరికాయి. కొన్ని అద్దెకు తీసుకున్నాం. వందలకొద్దీ మోటార్ బైక్స్, ట్రక్స్, హెల్మెట్స్ అన్నీ తయారు చేయించాం. మిలటరీ యూనిఫామ్స్ కుట్టించాం. ఫోన్స్, టెలీగ్రాఫ్స్, అప్పట్లో రొట్టెలు తయారు చేసే మిషన్, ట్యాంకర్స్ - ఇలా ప్రతిదీ తయారు చేశాం. సైనికుల తరహా ప్రత్యేక హెయిర్ కట్ కాబట్టి, లొకేషన్‌లో పదిమంది బార్బర్లుండేవాళ్లు. లొకేషన్లో వందల కొద్దీ ఆర్టిస్టులు ఉండేవాళ్లు.
 
 ఈ సినిమా నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టింది?
 55 రోజుల్లో పూర్తి చేసేయగలిగాం. ఇంత పెద్ద సినిమాను అన్ని రోజుల్లోనే పూర్తి చేయగలిగామంటే కారణం - ప్రీప్రొడక్షన్ కోసం మేం ఆరు నెలలు కేటాయించడమే. బౌండ్ స్క్రిప్ట్‌తో షూటింగ్ ప్రారంభించాం. ఒక్క రోజు షూటింగ్‌కి 20 నుంచి 30 లక్షల రూపాయలకు పైనే ఖర్చయ్యేది. సినిమా నిడివి మొత్తం రెండు గంటల ఐదు నిమిషాలు. ఈ చిత్రం ముహూర్త బలం చాలా గొప్పదని నా నమ్మకం. అందుకే అన్నీ బ్రహ్మాండంగా కుదిరాయి. 20 కోట్లలో తీయాలనుకున్నాం. 19 కోట్లలో పూర్తి చేశాం. మార్కెట్ శక్తికి మించిన ఖర్చు పెట్టాం. సినిమా మొదలు పెట్టినప్పుడు, ‘ఇండియన్ స్క్రీన్‌పై చూడని సినిమా చేస్తున్నాం అన్నావు కదా. బడ్జెట్ గురించి ఆలోచించవద్దు’ అని నిర్మాత రాజీవ్‌రెడ్డి అన్నారు. అసలెందుకీ సినిమా చేశావ్? అని కొంతమంది నన్నడిగితే ‘నేనింతవరకూ ఇలాంటి సినిమా చూడలేదు.. అందుకే’ అన్నాను.
 
 అప్పటి సైనికులను కలిసి సమాచారం సేకరించారా?
 అప్పట్లో నాథూరామ్ గాడ్సే గురించి ‘బట్ ఇండియా డివెడైడ్’ అనే సినిమా కథ రాసుకుంటున్నప్పుడు ఆయన సోదరుడు వినాయకరావు గాడ్సేని కలిశా. కానీ, ఇప్పుడు గూగూల్‌లో దొరకనిది లేదు. యూ ట్యూబ్‌లో బోల్డన్ని ఉన్నాయి. అయినప్పటికీ కొంతమందిని కలిశాను.
 
 ఇలాంటి చిత్రాలకు సంభాషణలు ఆయువుపట్టు కదూ...
 ఎగ్జాక్ట్‌లీ. నాకు బాగా నచ్చిన రైటర్ నాగరాజు గంధంగారు. బ్లాక్ టికెట్ నుంచి భగవద్గీత వరకూ చిన్న చిన్న మాటల్లో చెప్పేయగలుగుతారాయన. నాగరాజుగారు చనిపోవడం తీరని లోటు. ఈ మధ్యకాలంలో ప్రాస డైలాగ్స్ ఎక్కువయ్యాయి. నవ్వించడంతో పాటు జోల పాడినట్లుగా ఉండేలా డైలాగ్స్ రాసేవాళ్లు చాలా అరుదు. సాయిమాధవ్ ఈ కోవకు చెందిన రచయితే. ‘వేదం’కి నేనే డైలాగ్స్ రాశాను. ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’కి అప్పుడు సాయిమాధవ్ కలిసినప్పుడు, ‘ఏడు నెలల ముందు ఎక్కడున్నావ్? ‘వేదం’కి కూడా రాయించే వాణ్ణి’ అన్నాను. ఈ కథ గురించి ముందు నాగబాబు గారికి చెప్పింది ఆయనే. ఈ సినిమాకి సిరివెన్నెలగారి సాహిత్యం ఓ ప్రాణం. నేను టాకీ దగ్గర వదిలినప్పుడు పాటతో కథను నడిపించారు సిరివెన్నెలగారు.
 
 ఇందులో ఉన్న యుద్ధ సన్నివేశాల గురించి?
 చిన్న చిన్న యుద్ధాలు చాలా ఉన్నాయి. కానీ, 12 నిమిషాల పాటు సాగే పెద్ద యుద్ధం ఒకటుంది. దాని కోసం గుంతలు తవ్వినప్పుడు మా నాన్నగారు ‘ఏంటి డబ్బులన్నీ గుంతల్లో పోస్తున్నారా?’ అనేవారు.
 
 నాటి ప్రపంచ యుద్ధం నేటి తరాన్ని ఉద్విగ్నతకు గురి చేస్తుందంటారా?
 ఇది ఫోక్‌లోర్ మూవీ కాదు. సింపుల్ లవ్‌స్టోరీ కాదు. రొటీన్ కమర్షియల్ మూవీ కాదు. ఇది ఒక పీరియడ్ మూవీ. ఓ వార్ డ్రామా, లవ్‌స్టోరీతో సాగే సినిమా. నాటి యుద్ధం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పటి తరానికి ఉంటుంది. సో.. ఎగ్జయిట్ అవుతారు.
 ప్రపంచ యుద్ధం నేపథ్యంలో అంటే హిందీలో తీస్తే రీచ్ ఎక్కువేమోగా?
 నిజమే. కానీ, నాకెందుకో మన భాషలో చూపించాలనిపించింది.
 
 ఇంతకీ... అనుకోకుండా ఈ దసరాకి 22వ తేదీన రిలీజ్ చేయడం...?
 అక్టోబర్ 2న అనుకున్నాం. కుదరలేదు. దసరా చాలా మంచి రోజు. సెలవులు కూడా ఉంటాయి కాబట్టి, ఆ రోజు రిలీజవడం హ్యాపీ.
 
 క్లయిమ్యాక్స్ కుదరకే వరుణ్ మొదటి సినిమా ఆపేశాం!
 వరుణ్ తొలిచిత్రం నేనే చేయాల్సింది. దాని కోసం ఆరు నెలలు కర్రసాములో వరుణ్‌కి శిక్షణ ఇప్పించాం. కానీ, క్లయిమ్యాక్స్ కుదరలేదని పించింది. నాగబాబుగారి దగ్గరకి వెళ్లి క్షమించమని అడిగాను. ‘కంచె’ కథ పూర్తయ్యాక నాగబాబు గారికి చెప్పా. ఆయనకు నచ్చింది.
 
 రామ్‌చరణ్‌కి ఫస్టాఫ్ చెప్పా!
 రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ రెడీ చేశా. ఫస్టాఫ్ చెప్పా. బ్రహ్మాండంగా కుదిరింది. సెకండాఫ్ రెడీ చేసుకొని చెప్పా. ఇంకా కరెక్షన్స్ చేయాలనిపించింది. చేయాలి.
 
 ఆ ఛాన్సొచ్చింది... మహేశ్‌బాబు వల్లే!
 ‘గబ్బర్’తో నేను హిందీ రంగానికి వెళ్లడానికి హిందీ దర్శక-నిర్మాత సంజయ్ లీలాభన్సాలీ గారు ఎంత కారణమో, మహేశ్‌బాబు, ఆయన భార్య నమ్రత అంతకన్నా ఎక్కువ కారణం. ‘గబ్బర్’ చిత్ర సహ నిర్మాత షబీనాఖాన్‌కి నన్ను రికమెండ్ చేసింది మహేశ్, నమ్రతలే. అలాగే, ‘కంచె’ టీజర్ విడుదలైన గంటలోనే మహేశ్ ట్వీట్ చేశారు. తారక్ (ఎన్టీఆర్) లండన్ నుంచి ఫోన్ చేశాడు. ఇంకా రాజమౌళి, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఇలా అందరూ అభినందించారు. మహేశ్‌కి ‘శివమ్’ అనే ఒక కథ చెప్పాను. ‘కథ చెప్పేటప్పుడే సినిమా చూసేశా. ఇక సినిమా తీయక్కర్లేదేమో అన్నా’ను. చివరకు అదే జరిగింది (నవ్వుతూ).